
బెంగళూరులో మృతి.. ‘పురం’లో సర్టిఫికెట్
చిలమత్తూరు: జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో హిందూపురం మున్సిపల్ అధికారులు చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. దేశంలో ఎక్కడ మరణించినా.. ఎక్కడ జన్మించినా.. స్థానిక మున్సిపల్ అధికారులు కోరిన మొత్తాన్ని ముట్టజెపితే నిమిషాల వ్యవధిలో దొంగ సర్టిఫికెట్లను అందజేస్తున్నారు. వాస్తవానికి జనన, మరణాలు చోటు చేసుకున్న ప్రాంతంలోనే ధ్రువీకరణ పత్రాలు పొందాల్సి ఉంది. అయితే నిబంధనలు అతిక్రమిస్తూ హిందూపురం మున్సిపల్ అధికారులు జారీ చేస్తున్న ధ్రువీకరణ పత్రాలు.. వాటిని పొందిన వారికి భవిష్యత్తులో చుక్కలు చూపడం గ్యారంటీ అని కొందరు మున్సిపల్ అధికారులు హెచ్చరిస్తున్నారు.
హిందూపురంలోని కంసాల పేటలకు చెందిన వి.శంకరాచారి (84) ఈ ఏడాది జూలై 3న బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనికి సంబంధించి సదరు ఆస్పత్రి యాజమాన్యం డెత్ సర్టిఫికెట్‌ను అందజేసింది. దీని ఆధారంగా బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) డెత్ సర్టిఫికెట్‌ను జారీ చేస్తుంది. అయితే స్థానిక టీడీపీ నేత జోక్యం చేసుకుని డెత్ సర్టిఫికెట్‌ను హిందూపురం మున్సిపాల్టీ ద్వారానే అందజేయిస్తానని నమ్మబలకడంతో మృతుడి కుటుంబీకులు జూల్ 17న దరఖాస్తు చేసుకున్నారు. దీని ఆధారంగా డెత్ సర్టిఫికెట్‌ను మున్సిపల్ అధికారులు అందజేశారు. వయోభారంతో ఇంటి వద్దనే శంకరాచారి మృతి చెందినట్లుగా తప్పుడు రికార్డులు సృష్టించి ధ్రువీకరణ పత్రం జారీ చేయడం వివాదాస్పదమైంది. ఈ అక్రమాల్లో శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న ఓ అధికారి కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. మున్సిపల్ కమిషనర్ సంతకాలతోనే ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేయడం కలకలం రేపింది. ఇలాంటివి లెక్కకు మించి దొంగ సర్టిఫికెట్లు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునను ‘సాక్షి’ వివరణ కోరగా.. ఈ అంశం తన దృష్టిలో లేదని, అలాంటివి మంజూరు చేయడం నేరమవుతుందని అన్నారు. విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
హిందూపురంలోనే మృతి చెందినట్లుగా దరఖాస్తు చేయించిన పత్రం
బెంగళూరులోని ఆస్పత్రి నిర్వాహకులు అందజేసిన మరణ ధ్రువీకరణ పత్రం
జనన, మరణాల ధ్రువీకరణ పత్రాల జారీలో హిందూపురం మున్సిపల్ అధికారుల చేతివాటం
టీడీపీ నేతల కనుసన్నల్లో ఇష్టారీతిన
డెత్, బర్త్ సర్టిఫికెట్ల జారీ
ముడుపులు దండుకుని..
జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను పొందాలంటే అంత సులువు కాదు. అయితే హిందూపురం మున్సిపాల్టీలో కేవలం నిమిషాల వ్యవధిలోనే జనన, ధ్రువీకరణ పత్రాలను జారీ చేస్తుండడం గమనార్హం. స్థానిక టీడీపీ నేతల సిఫారసు తీసుకెళితే చాలు.. ముందు వెనుక ఆలోచించకుండా సర్టిఫికెట్లను జారీ చేస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. ఈ ప్రక్రియలో అధికారులు పెద్ద మొత్తంలో ముడుపులు దండుకుంటున్నట్లు సమాచారం. శంకరాచారి మరణ ధ్రువీకరణ పత్రం జారీ అంశంలోనూ హిందూపురం పట్టణానికి చెందిన ఓ టీడీపీ ముఖ్య నేత పాత్ర ఉన్నట్లుగా ఆరోపణలున్నాయి. స్థిరాస్తి విషయంలో మరణ ధ్రువీకరణ పత్రం అవసరంకావడంతో సదరు టీడీపీ నేత తన పలుకుబడిని ఉపయోగించి దొంగ సర్టిఫికెట్ చేయించి ఇచ్చినట్లుగా తెలిసింది.
అంతా మా ఇష్టం..

బెంగళూరులో మృతి.. ‘పురం’లో సర్టిఫికెట్