
సస్యరక్షణ చర్యలే ముఖ్యం
● డాట్ సెంటర్ శాస్త్రవేత్త రామసుబ్బయ్య
తలుపుల: పంటల సాగుతో పాటు సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపడితే నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చునని రైతులకు అనంతపురం డాట్ సెంటర్ శాస్త్రవేత్త కె.రామసుబ్బయ్య సూచించారు. ఏడీఏ శైలకుమారి, ఏఓ నాగ మధుసూదన్ ఆధ్వర్యంలో తలుపుల మండలం గొల్లపల్లితండాలో బుధవారం ఏర్పాటు చేసిన రైత శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాంత రైతులు ఎక్కువగా వేరుశనగ, టమాట తదితర పంటలు సాగు చేస్తున్నందున ఆయా పంటలలో సస్యరక్షణ చర్యలు, పంట సాగు విధానాలను వివరించారు. పకృతి విపత్తులు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రతలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఈఓ రాఘవేంద్ర, వీఐఏ సుధాకర్, సీఎస్‌ఏ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.
జిల్లాకు 1,923 మెట్రిక్ టన్నుల ఎరువులు
అనంతపురం అగ్రికల్చర్: స్పిక్ కంపెనీ నుంచి 1,922.75 మెట్రిక్ టన్నుల ఎరువులు జిల్లాకు సరఫరా కాగా, ఇందులో 904.5 మెట్రిక్ టన్నుల యూరియా ఉన్నట్లు రేక్ ఆఫీసర్, ఏడీఏ అల్తాఫ్ అలీఖాన్ తెలిపారు. స్థానిక ప్రసన్నాయపల్లి రైల్వేస్టేషన్ రేక్‌పాయింట్‌కు బుధవారం వ్యాగన్ల ద్వారా చేరిన ఎరువులు, యూరియాను పరిశీలించారు. 904.5 మెట్రిక్ టన్నుల యూరియాతో పాటు 507.85 మెట్రిక్ టన్నుల డీఏపీ, 255.2 మెట్రిక్ టన్నుల 20–20–0–13, 255.2 మెట్రిక్ టన్నుల 10–26–26 రకం కాంప్లెక్స్ ఎరువులు చేరాయన్నారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు యూరియాకు సంబంధించి కోటా మేరకు 399.915 మెట్రిక్ టన్నులు అనంతపురం మార్క్‌ఫెడ్‌కు, 200.655 మెట్రిక్ టన్నులు ప్రైవేట్ హోల్‌సేల్ డీలర్లకు కేటాయించగా... 303.93 మెట్రిక్ టన్నులు శ్రీసత్యసాయి జిల్లాకు కేటాయించినట్లు తెలిపారు. కాంప్లెక్స్, డీఏపీలు 90 శాతం మేర ప్రైవేట్ హోల్‌సేల్ డీలర్లకు 10 శాతం మార్క్‌ఫెడ్‌కు కేటాయించినట్లు వివరించారు.
జింక పిల్ల స్వాధీనం
బత్తలపల్లి: మండలంలోని ఈదుల ముష్టూరు కొట్టాల గ్రామంలో బోయ సాంబ శివుడు వద్ద ఉన్న జింక పిల్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందిన సమాచారం మేరకు బత్తలపల్లి పోలీసులు, ఫారెస్ట్ అధికారులు బుధవారం ఆ గ్రామానికి చేరుకుని పరిశీలించారు. ఇంట్లో ఉన్న జింక పిల్లతో పాటు సాంబశివుడిని పుట్టపర్తిలోని అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు. కార్యక్రమంలో ఏఎస్‌ఐ వెంకటేశులు, కానిస్టేబుల్ అనిల్‌కుమార్, అటవీ శాఖ బీట్ ఆఫీసర్ అక్కులప్ప పాల్గొన్నారు.
పొలాల్లోకి దూసుకెళ్లిన కర్ణాటక బస్సు
మడకశిర: కర్ణాటకకు చెందిన ఓ ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిల్ అయి పొలాల్లోకి దూసుకెళ్లింది. బుధవారం మధ్యాహ్నం పావగడ నుంచి 30 మంది ప్రయాణికులతో బెంగళూరుకు బస్సు బయల్దేరింది. మడకశిర సమీపంలోకి చేరుకోగానే బ్రేక్ ఫెయిల్ అయినట్లుగా డ్రైవర్ గుర్తించి చాకచక్యంగా వ్యవహరిస్తూ పొలాల్లోకి తిప్పాడు. పొలాల్లో బస్సు కొంత దూరం వెళ్లి ఆగిపోయింది. ఎవరూ గాయపడలేదు. ఈ సందర్భంగా డ్రైవర్‌ను పలువురు అభినందించారు.
ఉపాధ్యాయురాలి సస్పెన్షన్
ముదిగుబ్బ: మండలంలోని బ్రహ్మదేవరమర్రి పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు రోజారాణిని సస్పెండ్ చేస్తూ డీఈఓ క్రిష్టప్ప బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులను నోటికొచ్చినట్లు తిట్టడమే కాకుండా, విధులకు సక్రమంగా హాజరు కావడం లేదంటూ ఇటీవల డీఈఓకు విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణకు డీఈఓ ఆదేశించారు. విచారణాధికారి అందజేసిన నివేదిక ఆధారంగా ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంఈఓ రమణప్ప తెలిపారు.

సస్యరక్షణ చర్యలే ముఖ్యం

సస్యరక్షణ చర్యలే ముఖ్యం

సస్యరక్షణ చర్యలే ముఖ్యం