
పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారు
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉష శ్రీచరణ్
పెనుకొండ రూరల్: రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను కూటమి ప్రభుత్వం హరిస్తోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు కేవీ ఉష శ్రీచరణ్ మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. డీఎస్పీ పదోన్నతులపై చోటు చేసుకున్న అక్రమాలపై ఆధారాలతో సహా ‘సాక్షి’ పత్రికలో కథనం ప్రచురిస్తే.. కక్ష కట్టి విజయవాడలోని ‘సాక్షి’ కార్యాలయంపై దాడి చేయించడంతో పాటు ఎడిటర్ ధనంజయరెడ్డిపై అక్రమంగా కేసులు బనాయించిన ప్రభుత్వ తీరును ఆమె ఖండించారు. నిజాలను నిర్బయంగా రాసే పాత్రికేయులను అక్రమ కేసులతో కట్టడి చేయాలనుకోవడం మూర్ఖత్వమని వ్యాఖ్యానించారు.
భూసంరక్షణా విభాగం ఈఈగా పోలప్ప
అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఉన్న భూసంరక్షణా విభాగం (సాయిల్ కన్సర్వేషన్) ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు (ఈఈ)గా పోలప్ప బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. ఆయనకు ఆ స్థానంలో ఇప్పటి వరకూ ఇన్‌చార్జి ఈఈగా ఉన్న ఓబుళపతి బాధ్యతలు అప్పజెప్పారు. శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో డీఈగా ఉన్న పోలప్పకు ఈఈగా పదోన్నతి కల్పించి జిల్లాకు బదిలీ చేశారు. అలాగే డీఈ హోదాలో ఉన్న ఇన్‌చార్జి ఈఈ ఓబుళపతికి సైతం ఈఈగా పదోన్నతి కల్పించి ఒంగోలుకు బదిలీ చేశారు. అయితే ఓబుళపతి డెప్యుటేషన్ కింద ఏపీ ఆగ్రోస్ జిల్లా మేనేజర్‌గా కొనసాగనున్నట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఇరువురూ ఈఈలకు ఆ శాఖ ఉద్యోగులు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
11, 12న జిల్లా స్థాయి కళా ఉత్సవ్
పుట్టపర్తి అర్బన్: బుక్కపట్నంలోని డైట్ కళాశాల వేదికగా ఈ నెల 11, 12 తేదీల్లో ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, కళాశాలల్లో చదువుతున్న 9, 10, 11, 12 తరగతుల విద్యార్థులకు సంస్కృతి, కళలపై జిల్లా స్థాయి కళా ఉత్సవ్ పోటీలు–2025 నిర్వహించనున్నారు. ఈ మేరకు డైట్ కళాశాల ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రతిభ చాటిన వారిని ఈ నెల 23, 24 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. పూర్తి వివరాలకు 99499 93712, 79817 76864లో సంప్రదించవచ్చు.