
ఎమ్మెల్యే గుమ్మనూరుపై చర్యలు తీసుకోవాలి
ధర్మవరం: ఏపీ రైతు సంఘం రాష్ట్ర నాయకులతో దురుసుగా మాట్లాడిన గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఏపీ రైతు సంఘం శ్రీసత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాలపల్లి పెద్దన్న, సీపీఎం జిల్లా కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం ధర్మవరంలో వారు విలేకరులతో మాట్లాడారు. గుంతకల్లు నియోజకవర్గం గుత్తి, పామిడి మండలాల్లోని ఐదు గ్రామాల్లో సోలార్ విండ్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు లీజు పద్ధతిలో కాకుండా దళారులతో దౌర్జన్యంగా భూ సేకరణను టీడీపీ నేతలు చేపట్టారన్నారు. విషయం తెలుసుకున్న ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకరరెడ్డి, జిల్లా కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, మండల నాయకులు, రైతులతో కలసి క్షేత్రస్థాయిలో పర్యటిస్తుంటే ఎమ్మెల్యే జయరాం ఫోన్ చేసి అవమానకర రీతిలో దూషిస్తూ.. బెదిరింపులకు దిగడం సిగ్గు చేటన్నారు. ఎమ్మెల్యేపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులను కలుపుకుని పెద్ద ఎత్తున పోరాటాలు సాగిస్తామన్నారు. కార్యక్రమంలో ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా నాయకులు ఎస్‌హెచ్ బాషా, సీఐటీయూ నాయకులు జేవీ రమణ, అయూబ్‌ఖాన్, ఎల్.ఆదినారాయణ, హైదర్‌వలి, ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మారుతి, వెంకటస్వామి, ఖాదర్‌బాషా తదితరులు పాల్గొన్నారు.