
14 గ్రామాలకు రాకపోకలు బంద్
ముదిగుబ్బ: ఇటీవల కురిసిన వర్షాలతో ఈదుల వంకలో నీరు పారుతోంది. ముదిగుబ్బ–మల్లేపల్లి మధ్య నిర్మించిన ఈదులవంక బ్రిడ్జి తెగిపోవడంతో శుక్రవారం 14 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆయా గ్రామాలకు వెళ్లాల్సిన వారు.. మరో మార్గంలో 10 కిలోమీటర్ల్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తోంది. రెండేళ్ల క్రితం వర్షాలకు ఈ బ్రిడ్జి కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. అధికారులు బ్రిడ్జికి తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టారు. దీంతో బ్రిడ్జి తెగిపోయి రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గుర్తు తెలియని
యువకుడి హత్య
● చెరువులో పడేసిన దుండగులు
● మారాల గ్రామంలో ఘటన
పుట్టపర్తి అర్బన్: ఓ యువకుడిని హత్య చేసి తలకు ప్లాస్టిక్ సంచి చుట్టి.. చేతులు కట్టేసి చెరువులో పడేశారు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. బుక్కపట్నం పోలీసులు తెలిపిన వివరాల మేరకు..మారాల గ్రామ చెరువు నుంచి శుక్రవారం దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పరిశీలించారు. వారికి ఓ మృతదేహం కనిపించగా.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బుక్కపట్నం ఎస్‌ఐ కృష్ణమూర్తి తన సిబ్బందితో చెరువు వద్దకు వెళ్లి మృతదేహాన్ని బయటకు తీయించారు. మృతుడి వయస్సు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. 3 రోజుల క్రితమే ఎక్కడో హత్య చేసి మృతదేహాన్ని సంచిలో చుట్టి తీసుకువచ్చి మారాల చెరువులో పడేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుడి ఒంటిపై మొలతాడు, చేతికి రాగి కడియం మాత్రం ఉన్నాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు... పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పెనుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి వివరాలు ఎవరికై నా తెలిస్తే సమాచారం ఇవ్వాలని బుక్కపట్నం ఎస్‌ఐ కృష్ణమూర్తి కోరారు.

14 గ్రామాలకు రాకపోకలు బంద్