అనంతపురం అగ్రికల్చర్: లాభాల దిశగా సాగుతున్న టమాట ధరలకు ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాలు చేటు తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. టమాట నాణ్యత తగ్గితే ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు తగ్గిపోవచ్చని ట్రేడర్లు అంచనా వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 8 వేల హెక్టార్ల విస్తీర్ణంలో టమాట సాగులో ఉంది. జూలై మొదటి వారం నుంచి అనంతపురం మండలం కక్కలపల్లి మండీలో మార్కెటింగ్ మొదలైంది. కిలో రూ.25 ప్రకారం మొదలైన ధరలు ఈ నెల ఆరో తేదీ నాటికి గరిష్ట ధర రూ.47కు చేరుకుంది. ఒకట్రెండు రోజుల్లో రూ.50 మార్క్‌కు చేరుకుంటుందని భావించగా.. వర్షాల ఎఫెక్ట్‌తో శుక్రవారం కిలో రూ.37కు తగ్గిపోయింది. జూలై నెలంతా 15 కిలోల బాక్సు కనిష్టం రూ.300 నుంచి గరిష్టంగా రూ.700 వరకు పలకడంతో రైతులు కొంతవరకు లాభాల బాట పట్టారు. ఆగస్టు, సెప్టెంబర్ వరకు ఇదే పరిస్థితి ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. దీంతో రైతులు సంబరపడ్డారు. అయితే నాలుగు రోజులుగా వర్షాలు పడుతుండటంతో రైతుల్లో ఒకింత ఆందోళన వ్యక్తమవుతోంది. తెరపినివ్వకుండా వర్షాలు పడితే ఎగుమతులు తగ్గే పరిస్థితి ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కాయ తడిచి, మచ్చ వస్తే మార్కెట్‌లో ‘నో సేల్’ కింద ట్రేడర్లు కొనుగోలు చేసే పరిస్థితి ఉండదు. అలాంటి సమస్యలు రాకుండా జిల్లా యంత్రాంగం, ఉద్యానశాఖ, మార్కెటింగ్‌శాఖ చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
నాణ్యతపై ప్రభావం చూపే అవకాశం