
విస్తారంగా వర్షాలు
పుట్టపర్తి అర్బన్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రెండు నెలలుగా మోస్తరు వర్షం కూడా లేక ఎండుముఖం పట్టిన ఖరీఫ్ పంటలు కాస్త తేరుకుంటున్నాయి.
6 రోజుల్లో 68.7 మి.మీ సగటు వర్షపాతం
అల్పపీడనం ప్రభావంతో ఈనెల 3వ తేదీ ఆదివారం జిల్లాలోని 2 మండలాల పరిధిలో 1.8 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. అలాగే 4వ తేదీ సోమవారం 18 మండలాల్లో 6.9 మి.మీ, 5వ తేదీ మంగళవారం 31 మండలాల్లో 29.6 మి.మీ, 6వ తేదీ బుధవారం 29 మండలాల్లో 16.6 మి.మీ, 7వ తేదీ గురువారం 2 మండలాల్లో 0.7 మి.మీ, 8వ తేదీ శుక్రవారం 18 మండలాల పరిధిలో 13.1 మి.మీ సగటు చొప్పున 6 రోజుల్లోనే 68.7 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. దీంతో ఈ ఖరీఫ్‌లో సాగుచేసిన ఉద్యాన పంటలు, పూలతోటలు, మెట్ట భూముల్లో సాగుచేసిన వేరుశనగ, కంది, జొన్న తదితర పంటలు కోలుకుంటున్నాయి. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
63,226 హెక్టార్లకు చేరిన సాగు విస్తీర్ణం
ఖరీఫ్ సాగు విస్తీర్ణం 2,19,022 హెక్టార్లు కాగా, ఇప్పటి వరకూ 63,226 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగులోకి వచ్చాయి. ఇందులో అత్యధికంగా వేరుశనగ 35,097 హెక్టార్లు, కంది 11,586 హెక్టార్లు, రాగి 690 హెక్టార్లు, మొక్కజొన్న 8,910 హెక్టార్లు, వరి 720 హెక్టార్లు, జొన్న 230 హెక్టార్లు, పత్తి 3391 హెక్టార్లు, ఆముదం 2,379 హెక్టార్లలో సాగులోకి వచ్చినట్లు జిల్లా వ్యవసాయాధికారి సుబ్బారావు తెలిపారు. ఖరీఫ్‌లో వర్షాలు ఆలస్య కావడంతో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు. అందుకు అవసరమైన విత్తనాలు పంపిణీ చేస్తామన్నారు. ఈ సారి ఉలవలు, పెసర, అలసంద, జొన్న తదితర విత్తనాలు సబ్సిడీతో అందజేస్తామన్నారు.
18 మండలాల్లో వర్షం
గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకూ జిల్లాలోని 18 మండలాల్లో వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా నల్లమాడ మండలంలో 50 మి.మీ, లేపాక్షి మండలంలో 47.2 మి.మీ, ఓడీ చెరువు మండలంలో 45.4 మి.మీ వర్షపాతం నమోదైందన్నారు. అలాగే తాడిమర్రి 39.2 మి.మీ, నల్లచెరువు 34.2, కదిరి 31.2, గోరంట్ల 22.4, బుక్కపట్నం 22, ముదిగుబ్బ 20.4, గాండ్లపెంట 20, తనకల్లు 18.8, ధర్మవరం 18.2, తలుపుల 15.4, ఎన్‌పీకుంట 14.2, చిలమత్తూరు 9.4, అమడగూరు 5.4, పుట్టపర్తి 3.2, కొత్తచెరువు మండలంలో 1.2 మి.మీ వర్షపాతం నమోదైందని వెల్లడించారు.
తుపాను ప్రభావంతో వారం
రోజులుగా కురుస్తున్న వర్షాలు
కోలుకుంటున్న ఖరీఫ్ పంటలు

విస్తారంగా వర్షాలు

విస్తారంగా వర్షాలు