
నాలుగోసారి
సాక్షి, టాస్క్‌ఫోర్స్: టీడీపీ నేతల దౌర్జన్యాలు, దాడులతో ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడిన రామగిరి ఎంపీపీ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం నాలుగోసారి నోటిఫికేషన్ ఇచ్చింది. ఈనెల 13న ఎన్నిక నిర్వహించాలని పేర్కొంది. దీంతో రామగిరి పీఠంపై మరోసారి చర్చ జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఎలాగైనా సొంత మండలం రామగిరి పీఠాన్ని దక్కించుకోవాలని పరిటాల కుటుంబం పడరాని పాట్లు పడుతోంది.
గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫ్యాన్ హవా
రామగిరి మండలంలో 10 ఎంపీటీసీ స్థానాలుండగా... గత స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయ దుందుభి మోగించింది. పేరూరు– 1, పేరూరు– 2, పెద్దకొండాపురం, ఎంసీ పల్లి, పోలేపల్లి, కుంటిమద్ది, గంతిమర్రి, మాదాపురం, రామగిరి ...ఇలా 9 స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులే విజయ కేతనం ఎగురవేశారు. కేవలం నసనకోట స్థానాన్ని మాత్రం టీడీపీ దక్కించుకోగలిగింది.
తొలిసారి పీఠం వైఎస్సార్ సీపీ కై వసం
రామగిరి మండలం కొన్నేళ్లుగా పరిటాల కనుసన్నల్లో ఉండేది. అయితే రాష్ట్రంలో వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్సార్ సీపీ ఫ్యాన్‌గాలి వీయగా.. రామగిరిని కూడా వైఎస్సార్ సీపీ కై వసం చేసుకుంది. దీంతో మండలంలోని వివిధ గ్రామాల్లోని ఇళ్లపై వైఎస్సార్ సీపీ జెండాలు ఎగిరాయి. రామగిరి ఎంపీపీ స్థానాన్ని ప్రభుత్వం అన్‌రిజర్వ్‌డ్ మహిళకు కేటాయించడంతో రామగిరి ఎంపీటీసీ స్థానం నుంచి గెలిచిన మీనుగ నాగమ్మను వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ ఎంపీపీ పీఠంపై కూర్చోబెట్టారు. అయితే ఆమె అనారోగ్యంతో మృతి చెందగా ...రామగిరి ఎంపీపీ ఎన్నిక అనివార్యమైంది.
దాడులు..దౌర్జన్యాలతో మూడుసార్లు వాయిదా
రాష్ట్రంలో కూటమి సర్కార్ కొలువుదీరినప్పటి నుంచి రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ నేతల దాడులు... దౌర్జన్యాలు పెరిగిపోయాయి. అధికారం అండతో టీడీపీ నేతలు తమదే పైచేయి కావాలని పంతం పట్టారు. ఈక్రమంలోనే మహిళకు రిజర్వ్ అయిన రామగిరి ఎంపీపీ స్థానంపై కన్నేశారు. ఎలాగైనా కై వసం చేసుకునేందుకు ప్రయత్నించారు. కానీ తమ పార్టీ నుంచి ఒకే ఒక పురుషుడు ఎంపీటీసీగా గెలిపొందిన నేపథ్యంలో దౌర్జన్యాలకు తెర తీశారు.
● ఎంపీపీ మీనుగ నాగమ్మ మృతి నేపథ్యంలో మార్చి 27న ఎంపీపీ ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో పరిటాల కుటుంబం ఎలాగైనా తన సొంత మండలం రామగిరి పీఠం దక్కించుకోవాలని తీవ్రంగా ప్రయత్నించింది. కేవలం ఒక్క ఎంపీటీసీ స్థానంతోనే పీఠంపై జెండా ఎగురవేయాలని కుట్ర చేసింది. ఈ క్రమంలోనే వైఎస్సార్ సీపీ గుర్తుపై గెలిచిన పేరూరు–1, మాదాపురం ఎంపీటీసీ సభ్యులకు టీడీపీ నేతలు తమ పచ్చ కండువాలు కప్పి తమవైపునకు తిప్పుకున్నారు. పార్టీ ఫిరాయింపును తప్పుపడుతూ వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలు ఎన్నికను బహిష్కరించగా...తొలిసారి ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది.
● మే 18న రెండోసారి ఎంపీపీ ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వగా.. పేరూరు–2 ఎంపీటీసీ సభ్యురాలు భారతమ్మను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఘర్షణ వాతావరణం చేటుచేసుకోగా, ఎన్నిక సమయానికి ఎంపీటీసీ సభ్యులు రామగిరి చేరుకోలేకపోయారు. దీంతో కోరం లేక ఎన్నిక వాయిదా పడింది. ఎన్నికకు ఒకరోజు ముందు మే 17వ తేదీన అనెక్జర్ లెటర్ ఇవ్వడానికి రామగిరికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ నాయకులు పేరూరు కురుబ నాగిరెడ్డి, హరినాథ్‌రెడ్డి, బోయ రామాంజినేయులపై దాడులు చేశారు. అంతేకాకుండా వారి వాహనాన్ని ధ్వంసం చేశారు.
● మూడోసారి జూలై 16న రామగిరి ఎంపీపీ ఎన్నిక నిర్వహించాలని భావించినా...ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు ఎంపీటీసీ సభ్యులు ప్రకటించారు. దీంతో నాల్గోసారి ఈనెల 13న రామగిరి ఎన్నికకు అధికారులు నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
రామగిరి ఎంపీపీ ఎన్నికకు
మళ్లీ నోటిఫికేషన్
13న నిర్వహించాలని నిర్ణయించిన రాష్ట్ర ఎన్నికల సంఘం
పట్టుకోసం పరిటాల కుటుంబం పాకులాట
ఒక్క ఎంపీటీసీతో ఎంపీపీ స్థానం
కై వసానికి పడరాని పాట్లు
బెదిరింపులు...కిడ్నాప్‌లతో
మూడుమార్లు ఎన్నిక వాయిదా
ఒక్క అభ్యర్థితో పీఠం కోసం టీడీపీ పాకులాట
రామగిరి ఎంపీపీ స్థానం మహిళకు రిజర్వ్ అయ్యింది. టీడీపీ తరఫున గెలిచింది ఒకే ఒక ఎంపీటీసీ...పైగా మహిళ కాదు. అయినప్పటికీ పరిటాల కుటుంబం రామగిరి ఎంపీపీ స్థానాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నించి ఇప్పటికి మూడుసార్లు భంగపడింది. తాజాగా ఈనెల 13న జరిగే ఎన్నికలో ఎలాగైనా విజయం సాధించేందుకు కుట్రలు చేస్తోంది. అయితే ప్రస్తుతం టీడీపీ వైపు నిలిచిన ముగ్గురు ఎంపీటీసీలూ పురుషులే కాగా, మహిళా స్థానం ఎలా దక్కించుకుంటారోనని ప్రజలు చర్చించుకుంటున్నారు.

నాలుగోసారి