సత్యసాయి కీర్తి ఎల్లలు దాటాలి
ప్రశాంతి నిలయం: ‘సత్యసాయి కీర్తి ఎల్లలు దాటేలా శతజయంతి ఉత్సవాలు నిర్వహించాలి.. అందుకు జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సమష్టిగా కృషి చేయాలి. నవంబర్ 23న శత జయంతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటినుంచే ఏర్పాట్లు చేయాలి. జిల్లా యంత్రాంగం, సత్యసాయి సెంట్రల్ ట్రస్టు సభ్యులు అందరూ సమష్టిగా పనిచేసి శతజయంతి ఉత్సవాలు మరో వందేళ్లు గుర్తుండేలా వైభవంగా చేద్దాం’ అంటూ కలెక్టర్ టీఎస్ చేతన్ పిలుపునిచ్చారు. సత్యసాయి శతజయంతి వేడుకల నేపథ్యంలో ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలపై బుధవారం కలెక్టర్ చేతన్ కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వివిధ శాఖల అధికారులు, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులతో కలిసి సమీక్షించారు. ముందుగా ఇప్పటికే కేటాయించిన పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. అధికారులకు కేటాయించిన పనులను సమన్వయంతో పూర్తి చేయాలన్నారు. బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి ప్రముఖులు, రాజకీయ నాయకులు తరలివచ్చే అవకాశం ఉన్నందున... ఆరు హెలీప్యాడ్లు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేయాలన్నారు. తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, వాహనాల పార్కింగ్ తదితర పనులను ఇప్పటికే అధికారులకు అప్పగించామని, వారంతా పకడ్బందీగా పనులు చేయాలన్నారు. రైల్వే స్టేషన్ సమీపంలో కూడా తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్, పోలీస్ బందోబస్తు, రవాణా సౌకర్యం, నిరంతర విద్యుత్ సరఫరా, పట్టణ సుందరీకరణతోపాటు చిత్రావతి నది సుందరీకరణ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. చిత్రావతి హారతి ఘాట్, కమ్మవారిపల్లి, కప్పలబండ, ఎంఎస్‌ఎంఈ పార్క్ పాయింట్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి భద్రతా సిబ్బందిని నియమించాలన్నారు. అలాగే వివిధ మార్గాల గురించి భక్తులకు తెలిసే విధంగా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అన్ని పాయింట్ల వద్ద మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి మందులను సిద్ధంగా ఉంచుకోవాలని డీఎంహెచ్‌ఓను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు వారికి కేటాయించిన పనులను చిత్తశుద్ధిలో పూర్తి చేసి వేడుకలను విజయవంతం చేసేందుకు కృషి చేయాలన్నారు. సమావేశంలో ఎస్పీ వి.రత్న, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డీఆర్‌ఓ విజయ సారథి, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, డ్వామా పీడీ విజయేంద్ర ప్రసాద్, డీఎంహెచ్‌ఓ ఫైరోజా బేగం, సత్యసాయి ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు.
శతజయంతి వేడుకలు మరో వందేళ్లు గుర్తుండాలి
అధికారులకు కలెక్టర్
టీఎస్ చేతన్ ఆదేశం
ముందస్తు ఏర్పాట్లపై సమీక్ష


