గొల్లపల్లికి సంగాలప్ప స్వామి
బత్తలపల్లి: కురుబల ఆరాధ్యదైవం సంగాలప్ప స్వామి నాలుగు దశాబ్దాల తర్వాత శుక్రవారం మండలంలోని యర్రాయపల్లి నుంచి రాప్తాడు మండలం గొల్లపల్లికి చేరాడు. దీంతో గ్రామస్తులంతా ఆందోత్సాహాలతో స్వామి వారికి స్వాగతం పలికారు. దీంతో స్వామివారి విగ్రహం అప్పగింతకు సంబంధించి ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన కురుబ సామాజికవర్గంలో రెండు వర్గాల మధ్య నెలకొన్న వందేళ్ల నాటి వివాదానికి తెరపడింది.
సుప్రీం కోర్టును ఆశ్రయించి..
కురబల గుడికట్టు దేవుళ్లయిన గొల్లపల్లయ్యస్వామి, సంగాలప్పస్వామి అన్నదమ్ములు. ఏ ఉత్సవం జరిగినా ఇరువురు దేవుళ్లనూ ఊరేగించడం ఆనవాయితీ. అయితే సంగాలప్పస్వామి విగ్రహం విషయంలో యర్రాయపల్లి కమతం వంశస్తులు, గంగలకుంట కపాడం వంశస్తుల మధ్య వివాదం నెలకొంది. స్వామి విగ్రహాన్ని తమ గ్రామంలోనే ఉంచుకుంటామంటూ ఈ రెండు గ్రామాల వారు పట్టుబట్టారు. ఈ క్రమంలోనే 1999లో యర్రాయపల్లికి చెందిన కమతం వంశస్తులు సంగాలప్పస్వామిని గంగలకుంటకు పంపారు. ఈ విషయంలో గంగలకుంట కపాడం వంశస్తులు జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఒక్కో ఊరిలో ఆర్నెళ్ల పాటు స్వామివారి ఉత్సవ విగ్రహం ఉండేలా 2005లో కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పును అమలు చేయకుండా యర్రాయపల్లి కమతం వంశస్తులు హైకోర్టును ఆశ్రయించగా.. కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. దీనిపై కపాడం వంశస్తులు 2015లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ నవంబర్ 11న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో కమతం వంశస్తులు యర్రాయపల్లిలో స్వామివారి ఊరేగింపు చేశారు. అయితే సంగాలప్ప రెండోపూజ గొల్లపల్లయ్య స్వామితో కలిపి చేయడం ఆనవాయితీ కాగా, స్వామి ఉత్సవ విగ్రహాన్ని గొల్లపల్లికి తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే సుప్రీం తీర్పుపై తాము రివ్యూ పిటీషన్ వేశామని, అంతవరకూ స్వామివారి ఊరేగింపు జరగనివ్వబోమని కపాడం వంశస్తులు ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా అధికారులు రంగంలోకి దిగారు. శాంతి కమిటీ సమావేశం నిర్వహించి పరిస్థితి చక్కదిద్దారు.
గొల్లపల్లిలో ఆనందోత్సహాలు..
దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత తమ గ్రామానికి సంగాలప్ప స్వామి ఉత్సవ విగ్రహం విచ్చేస్తుండటంతో గొల్లపల్లి వాసులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. సాయంత్రం యర్రాయపల్లి గ్రామం నుంచి స్వామి ఉత్సవ విగ్రహాన్ని ఉరేగింపుగా గ్రామం చివర వరకు తీసుకువచ్చారు. అనంతరం ఐచర్ వాహనంలో ఎక్కించి భారీ పోలీసు బందోబస్తు మధ్య గొల్లపల్లికి తరలివెళ్లారు. అక్కడ రాత్రి గొల్లపల్లయ్యస్వామితో కలిసి గ్రామోత్సవం నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం సంగాలప్ప స్వామి ఉత్సవ విగ్రహాన్ని తిరిగి యర్రాయపల్లికి చేర్చనున్నారు.
భారీ బందోబస్తుతో గొల్లపల్లికి తరలింపు
సంగాలప్ప స్వామిని శుక్రవారం గొల్లపల్లికి తీసుకువెళ్లే క్రమంలో బత్తలపల్లి మండలం యర్రాయపల్లి గ్రామంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ధర్మవరం డీఎస్పీ హేమంత్‌కుమార్ ఆధ్వర్యంలో నలుగురు సీఐలు, ఆరుగురు ఎస్‌ఐలు, 20 మంది ఏఎస్‌ఐలు, 20 మంది స్పెషల్ పార్టీ పోలీసులు, 60 మంది పోలీసులు, మహిళా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేఽశారు. మరోవైపు బత్తలపల్లి తహసీల్దార్ స్వర్ణలతతో పాటు మండలంలోని రెవెన్యూ సిబ్బంది అందరూ గ్రామంలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షించారు.
నాలుగు దశాబ్దాల నిరీక్షణకు తెర
ధర్మవరం డీఎస్పీ ఆధ్వర్యంలో బందోబస్తు


