బెదిరింపులకు భయపడం
హిందూపురం: జిల్లా కేంద్రం సాధన కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే తహసీల్దార్, ఎంఈఓ, మున్సిపల్ కమిషనర్, పోలీసు అధికారులు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని, ఇలాంటి బెదిరింపులకు తాము భయపడేది లేదని జిల్లా కేంద్ర సాధన సమితి నాయకులు ధ్వజమెత్తారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం తలపెట్టిన ర్యాలీ పోలీసు ఆంక్షల నడుమ ప్రశాంతంగా సాగింది. సమితి సభ్యులు, న్యాయవాదులు, వివిధ పార్టీల నాయకులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. అంబేడ్కర్ సర్కిల్ వద్ద రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా సమితి అధ్యక్షుడు ఇందాద్, గౌరవాధ్యక్షుడు ఉమర్ ఫరూక్, ఉపాధ్యక్షులు శ్రీరాములు, బాలాజీమనోహార్, రైతుసంఘం నాయకులు వెంకట్రామిరెడ్డి, విద్యార్థి సంఘం నాయకుడు బాబావలి తదితరులు మాట్లాడారు. జిల్లా కేంద్రం సాధనలో స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ విఫలమయ్యారని మండిపడ్డారు. ఇప్పటికై నా ఎమ్మెల్యే స్పందించాలని కోరారు.
ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించారంటూ
కేసు నమోదు
హిందూపురం జిల్లా కేంద్ర సాధన సమితి నాయకులు 12 మందిపై వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా ర్యాలీ చేపట్టి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారన్న అభియోగంపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.
జిల్లా కేంద్రం సాధన సమితి నాయకులు


