సున్నా లేదు.. పావలా అసలే లేదు !
అనంతపురం అగ్రికల్చర్: చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు అడుగడుగునా అన్యాయం జరుగుతోంది. సూపర్‌సిక్స్ సూపర్‌హిట్ అంటూ డాంభికాలు ప్రదర్శిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వాస్తవంగా చూస్తే వ్యవసాయ, అనుబంధ రంగాలను పూర్తిగా విస్మరించేసింది. నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న రైతులకు ఏ రూపంలోనూ ఉపశమనం కల్పించే పరిస్థితి కనిపించడం లేదు. కనీసం రూ.లక్షలోపు పంట రుణాలకు సంబంధించి బడుగు రైతులకు సున్నావడ్డీ వర్తింపు లేదు. సకాలంలో రుణాలు చెల్లించిన వారికి పావలా వడ్డీ ప్రయోజనమూ కల్పించలేదు. అసలు ప్రభుత్వం పంట రుణాలు, సున్నావడ్డీ, పావలావడ్డీ వంటి ఊసే ఎత్తడం లేదని రైతులు వాపోతున్నారు.
నాడు వ్యవసాయ రంగానికి పెద్దపీట..
వ్యవసాయ రంగానికి, రైతుల సంక్షేమానికి గత వైఎస్ జగన్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. పేద, బడుగు, సన్న, చిన్నకారు రైతులకు బాసటగా నిలిచారు. ఏటా ఖరీఫ్, రబీలో బ్యాంకుల ద్వారా రూ. లక్ష లోపు పంట రుణాలు రెన్యూవల్స్, కొత్త రుణాలు తీసుకున్న రైతులపై వడ్డీ భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించింది. అందుకోసం వైఎస్సార్ సున్నావడ్డీ పంట రుణాల పథకం అమలు చేశారు. ఏటా జిల్లా వ్యాప్తంగా గ్రామీణ, ప్రభుత్వ రంగ, ప్రైవేట్, సహకార బ్యాంకుల పరిధిలో పంట రుణాల కింద ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సగటున 5.80 లక్షల మంది వరకు రైతులకు ఏటా రూ.10 వేల కోట్ల వరకు పంట రుణాలు పంపిణీ చేశారు. అందులో రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్న సన్న చిన్నకారు, బడుగు రైతులు 7,61,502 మందికి ఏకంగా రూ.156 కోట్ల మేర సున్నావడ్డీ నేరుగా ఖాతాల్లోకి జమ చేసింది. అందులో అనంతపురం జిల్లా పరిధిలో 3,39,362 మంది రైతుల ఖాతాల్లోకి రూ.71 కోట్లు, శ్రీసత్యసాయి జిల్లా పరిధిలో 4,32,140 మంది రైతుల ఖాతాల్లోకి రూ.75 కోట్ల మేర సున్నా వడ్డీ జమ చేశారు. సకాలంలో పంట రుణాలు చెల్లించిన రైతులకు పెద్ద మొత్తంలో పావలావడ్డీ ద్వారా ప్రయోజనం కల్పించారు.
రూ.లక్ష లోపు పంట రుణానికి
గత ప్రభుత్వం సున్నావడ్డీ వర్తింపు
సకాలంలో పంట రుణాలు చెల్లించిన వారికి పావలావడ్డీ చెల్లింపు
వడ్డీ వర్తింపుపై స్పందించని
చంద్రబాబు సర్కార్


