మార్పులకనుగుణంగా బోధన సాగాలి
పుట్టపర్తి అర్బన్: ఇంటర్మీడియట్ విద్య, పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పులకు అనుగుణంగా బోధనలో ముందుకు సాగాలని అధ్యాపకులకు ఇంటర్ విద్య ఓఎస్‌డీ రమేష్ సూచించారు. మారిన ఇంటర్ సిలబస్, పరీక్షల విధానంపై ఇంటర్మీడియట్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులకు శుక్రవారం పుట్టపర్తి మండలం జగరాజుపల్లి వద్ద ఉన్న మంగళకర ట్రస్ట్‌లో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఓఎస్‌డీ రమేష్ మాట్లాడుతూ... గణితంలో 1ఏ, 1బీ ఒకే సబ్జెక్టుగా మార్పు చేశారన్నారు. దీంతో మ్యాథ్స్ పరీక్షల్లో వంద మార్కులకు ఒక్కటే పేపర్‌ఉంటుందని, కనిష్టంగా 35 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణత సాధించినట్లుగా నిర్ణయించినట్లు తెలిపారు. బోటనీ, జువాలజీ కలిపి బయాలజీగా మార్పు చేయగా, మొదటి సంవత్సరంలో 85 మార్కులకు పరీక్ష ఉంటుందని, అయితే 29 మార్కులు, సెకండియర్‌లో 30 మార్కులు వస్తే పాస్ అయినట్లేనని వివరించారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ విద్యార్థులకు 30 మార్కులు చొప్పున ప్రాక్టికల్స్, గతంలో ఫెయిలై ఇప్పుడు పరీక్షలు రాయనున్న వారికి కొత్త మార్పులు వర్తించవన్నారు. కొత్తగా ఎలక్ట్రివ్ సబ్జెక్టు విధానాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం, ఏ గ్రూపు విద్యార్థులనైనా 24 సబ్జెక్టుల్లో దేనినైనా ఎంపిక చేసుకునే వెసలుబాటు కల్పించిందన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐఓలు చెన్నకేశవప్రసాద్, వెంకటరమణనాయక్, మంగళకర ట్రస్ట్ చైర్మన్ సురేష్‌కుమార్, జిల్లాలోని అన్ని ఇంటర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.
ఇంటర్ విద్య ఓఎస్‌డీ రమేష్


