పోషక యాజమాన్యంపై అవగాహన తప్పనిసరి
అనంతపురం అగ్రికల్చర్: సుస్థిర వ్యవసాయంలో భాగంగా పోషక యాజమాన్యంపై ఎప్పటికపుడు అవగాహన పెంచుకుని క్షేత్రస్థాయిలో రైతులకు మేలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఉద్యానశాఖ ఏడీ దేవానంద కుమార్, ఏపీఎంఐపీ ఏపీడీ ధనుంజయ తెలిపారు. శుక్రవారం స్థానిక ప్రాంతీయ ఉద్యాన శిక్షణ కేంద్రంలో కోరమాండల్, ఐపీఎల్, స్టాన్, ఇఫ్కో తదితర ఎరువుల కంపెనీల ఆధ్వర్యంలో ఆధునిక ఎరువుల యాజమాన్య పద్ధతులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రసాయన ఎరువులు అధిక మోతాదులో వాడకంతో రైతులకు పెట్టుబడి ఖర్చులు పెరిగిపోవడంతో పాటు నేల భౌతిక రసాయన లక్షణాలు దెబ్బతిని నిస్సారవంతంగా మారుతున్నాయన్నారు. ఇపుడున్న పరిస్థితుల్లో భూమిలో సేంద్రియ పోషకాలు (ఆర్గానిక్) పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. నానో యూరియా, డీఏపీని ప్రోత్సహించాలని సూచించారు. నత్రజని, భాస్వరం, పొటాష్ లాంటి స్థూలపోషకాల (మ్యాక్రో న్యూట్రియంట్స్)తో పాటు జింక్, బోరాన్, మెగ్నీషియం, క్యాల్షియం లాంటి సూక్ష్మపోషకాలను (మైక్రో న్యూట్రియంట్స్) ఏ పంటకు ఎంత మోతాదులో వాడాలో వివరించారు. కార్యక్రమంలో హార్టికల్చర్ ఆఫీసర్స్ (హెచ్‌ఓలు), ఆయా కంపెనీల ప్రతినిధులు మూర్తి, గోవింద రావు, వీబీవీ రమణారెడ్డి, మణిక ళ్యాణ్, వెంకటేష్, మంజునాథ్, టీఎం రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.
గవిమఠం భూములు
అన్యాక్రాంతం కానీయం
ఉరవకొండ: స్థానిక గవిమఠం భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటామని దేవదాయ శాఖ ఆర్‌జేసీ చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు. పట్టణంలోని గవిమఠంతో పాటు పెన్నహోబిలంలో ఆర్‌జేసీ పర్యటించారు. ఆయన మాట్లాడుతూ గవిమఠానికి చెందిన ఆరు ఎకరాల్లో రెండు ఎకరాలు ఆక్రమణకు గురైయినట్లు గుర్తించమన్నారు. ఆక్రమణలను తొలగించడానికి షాపు నిర్వాహకులకు నోటీసులు జారీ చేశామన్నారు. మిగిలిన నాలుగెకరాల్లో కాయగూరల మార్కెట్ నిర్మాణం కోసం స్థలం కేటాయించి, ఏడాదికి ఒకసారి మఠానికి బాడుగ చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే కర్ణాటకలోని తుముకూరు మఠం పరిధిలో46 గదులకు సంబంధించి అద్దె సొమ్ము మఠం ఖాతాకు జమయ్యేలా చేస్తామన్నారు. పెన్నహోబిలానికి రెగ్యులర్ ఈఓను నియమించి నూతన రథం నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఆలయంలో సాండ్ బ్లాస్ట్ పనులను ఆర్‌జేసీ పరిశీలించారు. కార్యక్రమంలో ఏసీ గంజి మల్లికార్జునప్రసాద్, అసిస్టెంట్ ఇంజనీర్ హరిత, గవిమఠం సహయ కమిషనర్ రాణి, ఇన్‌స్పెక్టర్ వన్నూర్‌స్వామి తదితరులు పాల్గొన్నారు.
చికిత్స పొందుతూ
శిశువు మృతి
కదిరి అర్బన్: మండలంలోని కాళసముద్రం ఫారెస్ట్ గెస్ట్ హౌస్ సమీపంలో ఈ నెల 16న గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లిన 3 రోజుల చిన్నారి అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. ఈ మేరకు కదిరి రూరల్ అప్‌గ్రేడ్ సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు.


