విజ్ఞాన భాండాగారం.. సమస్యల హారం
అనంతపురం కల్చరల్: సరస్వతీ నిలయాలైన గ్రంథాలయాల్లోనూ రాజకీయమే నడుస్తోంది. ఉమ్మడి జిల్లా గ్రంథాలయాల్లో గత పాలకులు సాగించిన అభివృద్ధి కంటికి కనిపించకూడదనే వైఖరి జిల్లా కేంద్ర గ్రంథాలయాధికారుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లా గ్రంథాలయం పేరును చెరిపేశారు. గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి సూచికలను తెలిపే శిలాఫలకాలను తెరమరుగు చేశారు. దశాబ్దాలుగా నిస్తేజంగా మారిపోయిన గ్రంథాలయాలను తీర్చిదిద్దడమే కాకుండా ఉద్యోగుల పాత బకాయిలను చెల్లించి మళ్లీ గాడిలో పడేసిన ఘనత డాక్టర్ వైస్సార్‌దేనని ప్రతి గ్రంథాలయ ఉద్యోగీ నేటికీ సగర్వంగా చెప్పుకుంటున్నారు. కానీ పాలకులు మారిన్పప్పుడల్లా గ్రంథాలయాల్లో రాజకీయాలు చోటు చేసుకుంటూ గతాన్ని మరుగున పడేసే ప్రయత్నం చేస్తుండడం విమర్శలకు తావిస్తోంది.
సమస్యలపై దృష్టి సారించక
నూతన పాలక మండలి బాధ్యతలు చేపట్టే నాటికి ఉమ్మడి జిల్లాలోని గ్రంథాలయాల్లో అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలు ఎదురొచ్చి స్వాగతం పలుకుతున్నాయి. కేంద్ర గ్రంథాలయంతో కలిపి ఉమ్మడి అనంత జిల్లాలో మొత్తం 70 గ్రంథాలయాలు ఉన్నాయి. వీటిలో గ్రేడ్ 1 గ్రంథాలయాలుగా జిల్లా కేంద్ర గ్రంథాలయంతో పాటూ ధర్మవరం, రాయదుర్గం, గుంతకల్లు ఉండగా, గ్రేడ్ – 2 గ్రంథాయాల పరిధిలో గుత్తి, ఉరవకొండ, పెనుగొండ, కదిరి, మడకశిర, తాడిపత్రి, కల్యాణదుర్గంతో పాటూ జిల్లాకేంద్రంలోని ఉమెన్స్ లైబ్రరీ ఉన్నాయి. ఇక మిగిలిన 58 గ్రంథాలయాలు గ్రేడ్ 3 పరిధిలో ఉన్నాయి. ఇవి కాక మరో 80 బీడీసీలు ( పుస్తక నిక్షిప్త కేంద్రాలు) ఉన్నాయి. వీటిన్నింటిలోనూ ఇప్పటి వరకూ 58 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సెస్సు వసూళ్లు కూడా అంతంత మాత్రంగా ఉండడంతో గ్రంథాలయాలు అభివృద్దికి ఆమడ దూరంగా ఉండిపోయాయి. అంతేకాక స్వీయ ఆదాయ వనరులపై పట్టు కోల్పోవడంతో ఉద్యోగులకు రానున్న రోజుల్లో ప్రతి నెలా జీతాలు చెల్లించడం కూడా అనుమానంగానే ఉంటోంది.
నామమాత్రానికే ‘డిజిటల్’
రాష్ట్రంలోనే ప్రప్రథమంగా అనంతపురంలో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటైంది. ప్రస్తుతం ఇది గొప్పలు చెప్పుకోవడానికి తప్ప మరెందుకూ ఉపయోగపడడం లేదు. ఈ లైబ్రరీలో దినపత్రికలు, పోటీ పరీక్షలకు సంబంధించి మెటీరియల్ తదితరాలను పూర్తిగా డిజిటల్ విధానం ద్వారా చదువుకునే వెసులుబాటు ఉంది. అయితే డిజిటల్ లైబ్రరీ అభివృద్ధిని అటకెక్కించడంతో ఇది కూడా కేవలం దిన పత్రికలు చదువుకోవడానికి తప్ప మరేందుకు ఉపయోగపడడం లేదు.
నిధుల కొరత
జిల్లా గ్రంథాలయ సంస్థను నిధుల కొరత వేధిస్తోంది. పాఠకులకు కొత్త పుస్తకాలు తెప్పించాలంటే నిధులు లేవు. రచయితలకు చెల్లించాల్సినవి పాత బకాయిలు అలాగే పేరుకుపోయాయి. గ్రామీణ ప్రాంత గ్రంథాలయాల పనితీరు, నిర్వహణ పర్యవేక్షణను కూడా అధికారులు పక్కన పెట్టేశారు. సెస్సు వసూలు విషయంలో నిర్ధిష్ట ప్రణాళిక లేక గ్రంథాలయాల నిర్వహణ అస్తవ్యస్థంగా మారింది.
అభివృద్ధిని పట్టించుకోకుండా
చరిత్రను చెరిపేసే ప్రయత్నం
వెంటాడుతున్న నిధుల కొరత
నిర్వీర్యమైన డిజిటల్ ౖలైబ్రరీ
నిధుల లేమి... అసౌకర్యాలు.. సరిపడా సిబ్బంది లేక ఉమ్మడి జిల్లాలోని గ్రంథాలయాల నిర్వహణ నానాటికీ తీసికట్టుగా మారుతోంది. దీనికి తోడు గత పాలకుల అభివృద్ధి ఏ మాత్రమూ కనిపించకూడదనే అజ్ఞానంతో చరిత్రను చెరిపేసే ప్రయత్నాలూ ఊపందుకున్నాయి.
పర్యవేక్షణ చేస్తున్నాం
ఉమ్మడి జిల్లాలో మొత్తం 70 శాఖా గ్రంథాలయాలున్నాయి. ఇవి కాక మరో 80 వరకు పుస్తక నిక్షిప్త కేంద్రాలు ఉన్నాయి. వీటిన్నింటినీ మేము క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నాం. చిన్నా చితక సమస్యలను పరిష్కారించే దిశగా సాగుతున్నాం. సెస్సు వసూళ్లు కూడా వేగవంతం చేస్తున్నాం.
– రమ, సెక్రటరీ,
ఉమ్మడి జిల్లా గ్రంథాలయం
విజ్ఞాన భాండాగారం.. సమస్యల హారం


