తప్పులకు ‘వందనం’
పుట్టపర్తి అర్బన్: కూటమి ప్రభుత్వం అమలు చేసిన తల్లికి వందనం పథకంలో తవ్వేకొద్దీ దారుణాలు బయటపడుతున్నాయి. దీనిపై ఒక్క అధికారి కూడా స్పందించడం లేదు. సచివాలయ సిబ్బంది, విద్యాశాఖ అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు..ఇలా ఎవరూ పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పుట్టపర్తి మండలం పెడపల్లి–1 సచివాలయంలో బి.భావన అనే మహిళకు ఏకంగా 21 మంది పిల్లలు ఉన్నట్లు పేర్కొంటూ ‘తల్లికి వందనం’ తుది జాబితా ప్రదర్శించిన విషయం విదితమే. దీనిపై కనీసం విచారణ కూడా చేయడం లేదు. భావన ఎవరు, ఎక్కడ ఉంటుంది, ఆమెకు ఎంత మంది పిల్లలు, ఏ తరగతి చదువుతున్నారనే వివరాలు చెప్పలేకపోతున్నారు. ఇదిలా ఉండగానే ఇదే మండలం పెడపల్లి–2 సచివాలయంలో మరో విచిత్రం బయటపడింది. ఈ సచివాలయ పరిధిలో గువ్వలగుట్టపల్లి, సుబ్బరాయనిపల్లి, బత్తలపల్లి, కోనాపురం గ్రామాలు ఉన్నాయి. ఇందులో మూడు ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 327 మంది అర్హులు ఉన్నట్లు తుది జాబితాలో చూపారు. అయితే..ఆయా పాఠశాలల్లో 60 మందికి పైగా విద్యార్థుల పేర్లు గల్లంతు అయినట్లు చెబుతున్నారు. ఈ గ్రామాల పరిధిలో ఎం.ఇంద్రజను 18 మంది విద్యార్థులకు తల్లిగా పేర్కొంటూ జాబితా ప్రదర్శించారు. అయితే..ఈమె ఖాతాను ఇన్‌యాక్టివ్ లిస్ట్‌లో పెట్టి డబ్బు జమ చేయలేదు. అసలు ఈమె ఎవరన్న విషయం ఎవరికీ తెలియకపోవడం గమనార్హం. అసలు భావన, ఇంద్రజ పేర్లు గల వ్యక్తులు ఉన్నారా లేక జాబితా పెంచుకునేందుకు ఇలా చేశారా అనే విషయం విద్యాశాఖ, సచివాలయ అధికారుల విచారణలో తేలాల్సి ఉంది. ఈ వింత జాబితాలను చూసి విద్యార్థులు, తల్లిదండ్రులు విస్తుపోతున్నారు. వాస్తవానికి తల్లికి వందనం నిధుల విడుదల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పెడపల్లి పర్యటన ఉండేది. పోలీసులు బారికేడ్లను సైతం సిద్ధం చేశారు, రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలను జేసీబీతో తొలగించారు. అసంపూర్తిగా ఉన్న జాతీయరహదారి 342 పనులను శరవేగంగా పూర్తి చేయించారు. అయితే జాబితాలో తప్పులు అధికంగా ఉండడం, వందల కొద్దీ విద్యార్థుల పేర్లు తల్లికి వందనం పథకంలో రాకపోవడంతో చంద్రబాబు పర్యటన రద్దు అయినట్లు సమాచారం.
18 మంది పిల్లలకు తల్లి ఒకరేనట
జాబితాలో పలువురు విద్యార్థుల పేర్లు గల్లంతు
సమస్యలను పరిష్కరించేవారు కరువు
తప్పుల తిప్పలతోనే సీఎం పర్యటన రద్దు!


