పట్టుగూళ్ల కేంద్రాన్ని పరిశీలించిన జేడీ
హిందూపురం: స్థానిక పట్టు గూళ్ల కేంద్రాన్ని పట్టు పరిశ్రమ శాఖ జాయింట్ డెరెక్టర్ శోభారాణి శుక్రవారం తనిఖీ చేశారు. కేంద్రానికి రోజూ వస్తున్న గూళ్ల నాణ్యత, ధరలు, వ్యాపారుల కొనుగోళ్లు, రైతులు ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. గూళ్లను పరిశీలించారు. తన గూళ్లు నాణ్యతగా ఉన్నా ధర తక్కువగా వేశారని ఓ రైతు వాపోయాడు. దీంతో మార్కెట్ అధికారి రైతుకు ధర సమజసం కాకపోతే తనవద్దకు వచ్చి తెలియజేస్తే రీలర్‌తో సంప్రదించి కొంతమేర పెంచేడానికి కృషి చేస్తామన్నారు. వెంటనే ఆ రైతుకు సంబంధించిన గూళ్ల లాట్ కొనుగోలు చేసిన రీలర్‌ను పిలిపించి కిలోపై మరో రూ.15 పెంచాలని చెప్పి రూ.585 ధర నిర్ణయించారు. రైతు సంఘం నాయకులు వెంకటరామరెడ్డి, సిద్ధారెడ్డి పలువురు జేడీని కలిసి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు వివరించారు. ప్రోత్సాహాకాలను మంజూరు చేయాలని కోరారు.


