కామాంధులను కఠినంగా శిక్షించాలి
● ఎస్పీ రత్నకు విన్నవించిన ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ
ధర్మవరం: దళిత బాలికపై అత్యాచారం చేసిన కామాంధులను కఠినంగా శిక్షించాలని ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి డిమాండ్ చేశారు. అత్యాచారానికి గురైన బాలిక బంధువులతో కలసి ధర్మవరం పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రత్న విచారిస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ రత్నను ఆయన కలసి వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. రామగిరి మండలంలోని ఏడుగుర్రాలపల్లికి చెందిన దళిత మైనర్ బాలిక పేదరికం, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు బెదిరించి అత్యాచారానికి ఒడిగట్టడం దారుణమన్నారు. మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టడానికి హోం మంత్రి ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. ఎస్పీని కలిసిన వారిలో బహుజన్ సమాజ్ పార్టీ సాకే వినయ్‌కుమార్, సమత సైనిక్ దళ్ జిల్లా అధ్యక్షుడు సుగమంచి శ్రీనివాసులు, ప్రొగ్రెసివ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ మంజుల నరేంద్ర, జేఏసీ నాయకులు రామకృష్ణ, గోపాల్, రాకెట్ల సూర్యనారాయణ, ముత్యాలప్ప తదితరులు ఉన్నారు.


