● భారీ ఆలయ నిర్మాణానికి రూపకల్పన చేసిన సనాతన ధర్మపరిరక్షణ వేదిక ●రూ.1,200 కోట్ల వ్యయంతో బృహత్ క్షేత్ర నిర్మాణం ●సమావేశంలో వెల్లడించిన సుప్రసిద్ధ స్తపతులు
అనంతపురం కల్చరల్: ప్రపంచంలోనే ఎత్తైన 216 అడుగుల రామానుజల విగ్రహం, ఓంకారేశ్వరంలోని 108 అడుగుల ఆదిశంకర భగవత్పాదుల విగ్రహం, తెలంగాణాలో సుప్రసిద్ధి చెందిన యాదాద్రి గుట్టపై ఉన్న స్వర్ణగిరి మందిరాన్ని మించిన మరో అరుదైన ఆలయానికి ‘అనంత’ వేదికగా మారనుంది. సనాతన ధర్మ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నిర్మాణమయ్యే అపురూపమైన ఈ కట్టడ నమూనాలను అనంత ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు శుక్రవారం అనంతపురంలోని గీతామందిరంలో ధర్మప్రచార మండలి అధ్యక్షుడు శ్రీపాద వేణు, ఇస్కాన్ ఇన్‌చార్జి దామోదర గౌరంగదాసు నేతృత్వంలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రసిద్ధ ఆలయాలు, కట్టడాలను నిర్మించిన ప్రముఖ శిల్పులు డీఎన్‌వీ ప్రసాద్ స్తపతి, రాజమండ్రికి చెందిన శ్రీనివాస స్తపతి, తిరుమల గోవింద పీఠం పీఠాధిపతి శ్రీరామప్రియ యతీంద్ర స్వామీజీ తదితరులు మాట్లాడారు. వైదిక ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, మరోసారి ఆధ్యాత్మికంగా స్వర్ణయుగం రానున్న నేపథ్యంలో చేపట్టిన ఈ బృహత్ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు.
ధార్మిక మండళ్ల ప్రతినిధులు పరాంకుశం కృష్ణశర్మ, ఆచార్య మనోరంజనరెడ్డి, చిదంబరం, శ్రీధర్, చంద్రశేఖర్, రంగారెడ్డి తదితరులు మాట్లాడుతూ.. కోటి మంది హిందువులను భాగస్వాములను చేస్తూ దాదాపు రూ.1,200 కోట్ల వ్యయంతో అనంత వేదికగా బృహత్ ఆలయాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని నాయనిపల్లి క్రాస్ వద్ద ప్రాచీన విశేషాలతో కూడిన ‘హరి–హర క్షేత్రం’ నిర్మిస్తున్నట్లు వివరించారు. ప్రపంచంలోనే ఎత్తైన 300 అడుగుల కోటి లింగాల అపురూప మహాశివలింగం, దాని కిందనే దివ్య స్పటిక శ్రీచక్ర మేరువు, చుట్టూ అష్టాదశ శక్తిపీఠాల ఆలయాల ప్రతిష్టాపన జరుగుతాయన్నారు. దీనికి పక్కనే 108 అడుగుల శ్రీమన్నారాయణ విశ్వరూప దర్శన కాంస్య విగ్రహంతో పాటు, అదే పీఠంపై దశావతారాల విగ్రహాలు నిర్మిస్తున్నట్లుగా తెలిపారు. వీటికి ఎదురుగా 54 అడుగుల ఎత్తుతో నంది, గరుడ విగ్రహాలు, సప్తాశ్వ రథారూఢుడైన సూర్యదేవ విగ్రహం, త్రిమతాచార్యులైన ఆది శంకరులు, మధ్వాచార్యులు, రామానుజాచార్యుల విగ్రహలను ఏర్పాటు చేస్తామన్నారు. అన్నింటి కంటే ప్రధానంగా ఈ విశాలమైన ప్రదేశంలో వైదిక ధర్మాన్ని నేర్పే సంస్కృత పాఠశాల, వేద విజ్ఞానాన్ని అందించే పుస్తక భాండాగారం, రిషి విజ్ఞాన డిజిటల్ లైబ్రరీ, ప్రాచీన ఆయుర్వేదాలయం, రామాయణ, భగవద్గీతల విశిష్టతలను తెలియజేసే కళాఖండాలూ నిర్మిస్తామన్నారు. దేశ విదేశాలలో స్థిరపడిన హిందువులు వచ్చి దర్శించుకునేందుకు వీలుగా పర్యాటకంగా ఈ ఆలయ ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నట్లు ప్రత్యేక కమిటీగా ఏర్పడిన ధర్మ పరిరక్షణ వేదిక సభ్యులు వెల్లడించారు. నాలుగేళ్ల క్రితం ఈ అపురూప కట్టడం గోదావరి తీరంలో కట్టాలని సంకల్పించినా ఇక్కడి ఆధ్యాత్మికవేత్తల చొరవతో అనంతకు మార్చారన్నారు. ఈ ఏడాది ఆగస్టులో భూమి పూజ ఉంటుందని, అప్పటి నుంచి ఐదేళ్ల లోపు నిర్మాణం పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు.
‘హరి–హర’ క్షేత్రానికి అడుగులు
‘హరి–హర’ క్షేత్రానికి అడుగులు