చిలమత్తూరు: విశాఖలోని ఏసీఏ – వీడీసీఏ క్రికెట్ స్టేడియానికి ఉన్న వైఎస్సార్ పేరును రాష్ట్ర ప్రభుత్వం కక్ష పూరితంగా తొలగించిందని హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త టీఎన్ దీపిక మండిపడ్డారు. హిందూపురం పార్టీ కార్యాలయంలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. పేదల ముఖ్యమంత్రిగా పేరు ప్రఖ్యాతలు గడించి, ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరును తొలగించిన మాత్రాన ఆయన స్థానం పేదల్లో చెరిగిపోదనే విషయాన్ని కూటమి పెద్దలు గ్రహించాలన్నారు. వైఎస్‌ఆర్, వైఎస్ జగన్ పేరు వింటే చంద్రబాబుకు ఎందుకంత భయమని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలతో ప్రజల్లో అప్రతిష్ట మూటకట్టుకోవాల్సి వస్తుందన్నారు. ఇంతటి దుర్మార్గమైన ప్రభుతాన్ని మునుపెన్నడూ చూడలేదన్నారు. కూటమి ప్రభుత్వ అరాచకాలు ప్రజాస్వామ్యానికి చేటు తెస్తున్నాయన్నారు. ప్రజలు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని తప్పక బుద్ది చెబుతారని పేర్కొన్నారు.
హిందూపురం వైఎస్సార్‌సీపీ
సమన్వయకర్త టీఎన్ దీపిక