
కదిరి: గొర్రెలు, మేకల పెంపకం దారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ప్రోత్సాహం అందిస్తున్నాయి. మాంసం ఉత్పత్తి పెంచడమే కాకుండా ఉపాధి కోసం ఎదురు చూస్తున్న వారికి ఆదాయం పెంపొందించేందుకు ప్రభుత్వం ‘నేషనల్ లైవ్ స్టాక్ మిషన్’ (ఎన్‌ఎల్‌ఎం) ద్వారా ఓ పథకాన్ని తీసుకొచ్చింది. గొర్రెలు, మేకల పెంపకంపై ఆసక్తి ఉన్న ఎవరైనా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. వ్యక్తిగతంగా గానీ, సామూహికంగా గానీ, సహకార సంఘాలు, రైతు ఉత్పత్తి సంఘాలు, స్వయం సహాయక సంఘాలు ఇలా తమకు ఇష్టమొచ్చిన రీతిలో ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లాలో చాలా మందికి ఈ పథకంపై అవగాహన లేక పోవడంతో ఎక్కువ మంది దరఖాస్తు చేసుకోలేక పోతున్నారు. 2021–22లో ప్రారంభమైన ఈ పథకం 2026–27 ఆర్థిక సంవత్సరం వరకు అమల్లో ఉంటుంది.
యూనిట్ వివరాలు ఇలా
కనిష్టంగా 100 గొర్రెలు, గరిష్టంగా 500 గొర్రెలు లేదా మేకలను ఒక యూనిట్‌గా పరిగణిస్తారు. ఇందులో ఏ యూనిట్‌కై నా సబ్సిడీ వర్తిస్తుంది. ఇందులో పునరుత్పత్తి కోసం మాత్రమే జీవాలను పెంచాల్సి ఉంటుంది. కేవలం పొట్టేళ్లు లేదా మేక పోతుల పెంపకానికి మాత్రమే అయితే వర్తించదు. సబ్సిడీ విడుదల కావడానికి 2 నెలల నుండి 6 నెలలు పట్టవచ్చు. ప్రాజెక్టు వ్యయంలో 50 శాతం సబ్సిడీని (గరిష్టంగా రూ.50 లక్షలు) రెండు విడతలుగా మంజూరు చేస్తారు. 500 గొర్రెలు లేదా మేకల యూనిట్‌కు దరఖాస్తు చేసుకున్న వారికి మొదటి దశలో 50 శాతం (రూ.25 లక్షలు), ప్రాజెక్టు చివరి దశలో మిగతా 50 శాతం (రూ.25 లక్షలు) అందజేస్తారు.
ఎంపిక చేసుకునే జీవాలు
గొర్రెలు లేదా మేకల పెంపకానికి అందరూ అర్హులే. ఇందులో కుల, మతాల ప్రస్తావన లేదు. అయితే పశుపోషణపై కొంత అవగాహన ఉండాలి. ఈ పథకం ద్వారా యూనిట్‌ను ప్రారంభిస్తే సాంకేతిక సలహాదారుగా అనుభవజ్ఞులైన పశువైద్య సిబ్బంది ఒకరిని నియమించుకోవాలి. నూతన సాంకేతిక విధానం ద్వారా జీవాలను పెంచాల్సి ఉంటుంది. ప్రభుత్వం గుర్తించిన 44 గొర్రె జాతులు లేదా 38 మేక జాతుల్లో వేటినైనా ఎంపిక చేసుకోవచ్చు. ఈ విషయం ప్రాజెక్టు రిపోర్టులో తెలియజేయాల్సి ఉంటుంది.
ఎంత భూమి కావాలంటే...
100 నుంచి 500 జీవాల వసతి కోసం అర ఎకరం పొలం ఉండాలి. దీనికి అదనంగా అక్కడే పశుగ్రాసం పెంపకం కోసం 5 నుంచి 10 ఎకరాల భూమి అవసరం. భూమి సొంతం కాకపోయినా లీజుకు తీసుకున్నా సరిపోతుంది. అయితే కచ్చితంగా నీటి వసతి ఉండాలి. ఈ పథకంపై ఆసక్తిగలవారు www.nlm.udyamimitra.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే స్థానిక పశు సంవర్ధక శాఖ అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది.
అవగాహన కల్పిస్తున్నాం
జిల్లాలోని గ్రామీణ యువతకు, ఔత్సాహిక రైతులకు జాతీయ లైవ్ స్టాక్ మిషన్ పథకం ద్వారా గొర్రెలు, మేకల యూనిట్‌ల నిర్వహణ కోసం అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. ఈ పథకం ద్వారా ప్రభుత్వం గరిష్టంగా రూ.50 లక్షలు దాకా సబ్సిడీ ఇస్తుంది.
– శుభదాస్, జేడీ, జిల్లా పశుసంవర్ధకశాఖ
సహకారం అందిస్తాం
గొర్రెలు లేదా మేకల యూనిట్ నిర్వహణ కోసం ముందుకొచ్చే గ్రామీణ యువతకు మా వంతు సహకారం అందిస్తాం. దరఖాస్తు చేసుకునే విధానం దగ్గర నుంచి బ్యాంకుల నుంచి రుణం పొందే వరకూ అన్ని విషయాల్లో సహకరిస్తాం. ఈ పథకం ద్వారా ఎంతో లబ్ధి పొందవచ్చు. ఉపాధితో పాటు పెద్ద మొత్తంలో సబ్సిడీ కూడా అందుకోవచ్చు. వివరాలకు 94410 10116 నంబరులో సంప్రదించవచ్చు.
– కోలా వెంకటరమణ, జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక మండలి సభ్యుడు
గొర్రెలు లేదా మేకల యూనిట్ వివరాలు
యూనిట్ బ్యాంకు రుణం సబ్సిడీ
500 గొర్రెలు 25 పొట్టేళ్లు రూ.కోటి రూ.50 లక్షలు
(లేదా) 500 మేకలు 25 మేక పోతులు
400 గొర్రెలు 20 పొట్టేళ్లు (లేదా) రూ.80 లక్షలు రూ.40 లక్షలు
400 మేకలు 20 మేక పోతులు
300 గొర్రెలు 15 పొట్టేళ్లు (లేదా) రూ.60 లక్షలు రూ.30 లక్షలు
300 మేకలు 15 మేక పోతులు
200 గొర్రెలు 10 పొట్టేళ్లు (లేదా) రూ.40 లక్షలు రూ.20 లక్షలు
200 మేకలు 10 మేక పోతులు
100 గొర్రెలు 5 పొట్టేళ్లు (లేదా) రూ.20 లక్షలు రూ.10 లక్షలు
100 మేకలు 5 మేక పోతులు
రూ.కోటి రుణం.. రూ.50 లక్షల సబ్సిడీ
అన్ని సామాజిక వర్గాల వారూ అర్హులే
మాంస ఉత్పత్తులు పెంచడంతోపాటు యువతకు ఉపాధి
దరఖాస్తునకు కావాల్సిన డాక్యుమెంట్లు
డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)
దరఖాస్తుదారుని ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, అడ్రస్ ప్రూఫ్
బ్యాంకు అకౌంట్ వివరాలు
జీవాల పెంపకంపై అనుభవం ఉన్నట్లు స్థానిక పశువైద్యాధికారి నుంచి ధ్రువీకరణ పత్రం
భూమికి సంబంధించిన పత్రాలు
గ్రూప్ సభ్యులు కలిసి యూనిట్ ప్రారంభించాలనుకుంటే సభ్యులందరి వివరాలు
మాంసం ఉత్పత్తి పెంచడంతో పాటు గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. రూ. కోటి దాకా బ్యాంకుల నుంచి రుణం ఇప్పించడమే కాకుండా అందులో గరిష్టంగా రూ.50 లక్షల దాకా రాయితీ ఇస్తోంది.


Comments
Please login to add a commentAdd a comment