బాలల హక్కుల వారోత్సవాలు జయప్రదం చేయండి | - | Sakshi
Sakshi News home page

బాలల హక్కుల వారోత్సవాలు జయప్రదం చేయండి

Nov 14 2023 12:40 AM | Updated on Nov 14 2023 12:40 AM

పుట్టపర్తి అర్బన్‌: భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని నవంబర్‌ 14 నుంచి వారం రోజుల పాటు జరిగే బాలల హక్కుల వారోత్సవాలను జయప్రదం చేయాలని ఐసీడీఎస్‌ పీడీ లక్ష్మీకుమారి పిలుపునిచ్చారు. పుట్టపర్తిలోని చిన్నపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఉదయం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. 15న ఆన్‌లైన్‌ సేఫ్టీపై యువతకు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమం, 16న బాలబాలికలకు క్రీడాపోటీలు, 17న అన్ని మండలాల్లో యువతకు చిత్రలేఖన పోటీలు, 18న బాలబాలికల సంరక్షణపై ఆయా శాఖ పరిధిలో శిక్షణ, 19న మానవహారం, క్యాండిల్‌ ర్యాలీ, 20న అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం జరపనున్నట్లు వివరించారు.

జాతీయ స్థాయి జూడో పోటీలకు చిగిచెర్ల విద్యార్థులు

ధర్మవరం రూరల్‌: జాతీయ స్థాయి జూడో పోటీలకు చిగిచెర్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. అండర్‌–14 స్కూల్‌ గేమ్స్‌ రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ చాటుకున్న విక్రాంత్‌, యశ్వంత్‌, అప్జల్‌, నందిని, యస్విత, లాస్యరెడ్డి ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకూ జమ్ముకాశ్మీర్‌ వేదికగా సాగే జాతీయ స్థాయి పోటీల్లో ఏపీ జట్టు తరఫున ప్రాతినిథ్యం వహించేందుకు తరలివెళ్లారు. ఈ మేరకు ఈ పాఠశాల పీడీ ప్రతాపరెడ్డి తెలిపారు.

నేటి నుంచి జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

అనంతపురం: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం నుంచి 20వ తేదీ వరకూ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ ఎల్‌ఎం ఉమాదేవి సోమవారం తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంతో పాటు ప్రతి మండల శాఖాలోనూ విద్యార్థులకు వివిధ రకాల పోటీలు, సాహితీసాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు.

నేటి నుంచి సహకార వారోత్సవాలు

అనంతపురం అగ్రికల్చర్‌: ఏటా నవంబర్‌ 14 నుంచి 20వ తేదీ వరకూ నిర్వహించనున్న అఖిల భారత సహకార వారోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది 70వ వారోత్సవాలను నిర్వహించనున్నట్లు రాయలసీమ సహకార శిక్షణా కేంద్రం ప్రిన్సిపాల్‌ బి.శ్రీనివాసులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. తొలిరోజు మంగళవారం అనంతపురంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ‘భారత దేశాన్ని 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో సహకార సంఘాల పాత్ర’ అనే అంశం ఆధారంగా చర్చాగోష్టి నిర్వహించనున్నారు. వారం రోజుల పాటు సహకార రంగం ఆవిర్భావం, విశిష్టత, సహకార సూత్రాలు, సహకార పతాకం, అందిస్తున్న సేవలు, సహకార వ్యవస్థ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలను చైతన్య పరుచే కార్యక్రమాలు ఉంటాయి.

వ్యక్తి అనుమానాస్పద మృతి

మడకశిర: స్థానిక 8వ వార్డుకు చెందిన శ్రీకాంత్‌(30) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన మేరకు... కూలి పనులతో జీవనం సాగించే శ్రీకాంత్‌కు భార్య, కుమారుడు ఉన్నారు. ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులతో గొడవ పడిన ఆయన ఓ గదిలోకి వెళ్లి కొడవలితో కుడిచెవి పక్కన తల భాగాన్ని తనకు తానే నరుక్కున్నాడు. విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు, భార్య వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం తుమకూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్సకు స్పందించక ఆయన మృతి చెందాడు. ఘటనపై సీఐ సురేష్‌బాబు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement