
ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు
లేపాక్షి: పర్యాటక కేంద్రం లేపాక్షి ఖ్యాతి ఎల్లలు దాటేలా ప్రతి ఒక్కరం కృషి చేద్దామని జిల్లా పర్యాటక శాఖ అధికారి నాగేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం లేపాక్షిలో ప్రపంచ పర్యాటక దినోత్సవ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. తొలుత లేపాక్షిలోని గురుకుల పాఠశాల విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులు నంది విగ్రహం నుంచి బస్టాండు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం దేవాలయం ఆర్చ్ వద్ద మానవ హారంగా ఏర్పడి ‘ఉంచుదాం..ఉంచుదాం.. లేపాక్షిని క్లీన్‌గా ఉంచుదాం’, ‘ప్లాస్టిక్‌ను నిషేధించాలి’, ‘రావాలి..రావాలి.. యునెస్కో గుర్తింపు రావాలి’అంటూ నినాదాలు చేశారు. అదేవిధంగా పర్యాటక కేంద్రమైన లేపాక్షిలో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పర్యాటక శాఖ అధికారి నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ... ఏటా సెప్టెంబరు 27వ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని లేపాక్షిలో ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగానే ముందుస్తు ర్యాలీని నిర్వహించినట్టు ఆయన పేర్కొన్నారు. లేపాక్షికి యునెస్కో శాశ్వత గుర్తింపు రావడానికి ప్రజల భాగస్వామ్యంతోనే అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
లేపాక్షికి జాతీయ అవార్డు..
ఉత్తమ పర్యాటక కేంద్రంగా లేపాక్షిని ఎంపిక చేసిందని నాగేశ్వరరెడ్డి తెలిపారు. ఏటా ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా కేంద్రం అవార్డులు ఇస్తుందని, ఈసారి 31 రాష్ట్రాల నుంచి 795 దరఖాస్తులు అందగా, అధికారులు లేపాక్షిని ఎంపిక చేసారన్నారు. భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బుధవారం న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో లేపాక్షి సర్పంచ్ ఆదినారాయణ అవార్డు అందుకుంటారని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ బాబు, ఎంపీడీఓ నరసింహనాయుడు, స్థానిక టూరిజం మేనేజర్ లక్ష్మణరావు, ఏఎస్‌ఐ షర్ఫుద్దీన్, గ్రామ సర్పంచ్ ఆదినారాయణ, వైస్ ఎంపీపీ అంజినరెడ్డి, ఎంపీటీసీ సభ్యులు ఆదినారాయణ, అశ్వత్తప్ప, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ నారాయణస్వామి, కోఆప్షన్ సభ్యులు బషీర్, స్థానిక నాయకులు చలపతి, అంజినరెడ్డి, నిస్సార్ తదితరులు పాల్గొన్నారు.
‘యునెస్కో’ శాశ్వత గుర్తింపు కోసం
కృషి చేద్దాం
జిల్లా పర్యాటక శాఖ అధికారి నాగేశ్వరరెడ్డి
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ

మానవహారంగా ఏర్పడిన అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు

ర్యాలీలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు