గెజిట్ కాపీని కలెక్టరేట్ ఏఓకు అందజేస్తున్న ఉద్యోగులు
పుట్టపర్తి అర్బన్: జిల్లా కేంద్రంలో పని చేస్తున్న ఉద్యోగులకు 16 శాతం హెచ్‌ఆర్‌ఏ వర్తింపజేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. శనివారం ఏపీ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్, ఏపీఎస్ ఆర్టీసీ, ఎన్‌ఎంయూ తదితర సంఘాలకు చెందిన ఉద్యోగులు కలెక్టరేట్‌లో ఏఓ వెంకటనారాయణకు గెజిట్ కాపీని అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కేంద్రానికి 8 కిలోమీటర్ల పరిధిలో పని చేస్తున్న ఉద్యోగులందరికీ అడిగిన వెంటనే హెచ్‌ఆర్‌ఏ వర్తింపునకు కలెక్టర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఆర్‌అండ్‌బీ అధికారులు చర్యలు తీసుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు.
హౌసింగ్ అధికారులపై
విచారణకు ఆదేశం
అనంతపురం టౌన్: ఉచిత ఇసుక కూపన్లను ఇతరులకు అమ్ముకున్నట్లు ఇద్దరు హౌసింగ్ అధికారులపై ఫిర్యాదులు రావడంతో విచారణకు ఆదేశించినట్లు హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ నరసింహారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. బెళుగుప్ప మండలానికి సంబంధించి హోలోగ్రామ్‌తో కూడిన ఇసుక కూపన్లను గుండ్లపల్లి సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గోవర్ధన్‌తోపాటు శశికాంత్ అనే వర్క్ ఇన్‌స్పెక్టర్ కలిసి శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో అమ్ముకున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు. జగనన్న ఇళ్ల నిర్మాణాల కోసం కేటాయించిన ఉచిత ఇసుక కూపన్లను పక్కదారి పట్టిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పీడీ హెచ్చరించారు.
25 నుంచి బీఈడీ రెగ్యులర్ పరీక్షలు
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో రెగ్యులర్ బీఈడీ, బీపీఈడీ రెగ్యులర్ మొదటి, నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 25 నుంచి నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ జీవీ రమణ తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని కళ్యాణదుర్గం, అనంతపురం, హిందూపురం, కదిరి, తాడిపత్రి, గుంతకల్లు, ఎస్కేయూ బీఈడీ కళాశాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మొదటి సెమిస్టర్ పరీక్షలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, నాలుగో సెమిస్టర్ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు.


