అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం

● సిబ్బందికి ఎస్పీ మాధవరెడ్డి ఆదేశం
● అగళి, రొళ్ల, రొద్దం స్టేషన్ల తనిఖీ
మడకశిర(అగళి)/రొళ్ల/రొద్దం: శాంతిభద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ మాధవరెడ్డి సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం ఆయన రొళ్ల, అగళి, రొద్దం పోలీసు స్టేషన్లను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఆయా స్టేషన్ల పరిధిలో నమోదైన కేసులు, దర్యాప్తుపై ఆరా తీశారు. వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, అంతర్‌రాష్ట్ర చెక్ పోస్టుల్లో నిఘా మరింత పెంచాలన్నారు. వేసవిలో చోరీలకు ఆస్కారం ఎక్కువగా ఉంటుందని, దీన్ని అరికట్టేందుకు బీట్లు పెంచాలన్నారు. మట్కా, జూదం మద్యం, ఇసుక అక్రమ రవాణాకు పూర్తిగా అడ్డుకట్ట వేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి సారించాలని, తరచూ ప్రమాదాలు చోటుచేసుకునే ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరిక బోర్డులు నాటించాలని సిబ్బందికి సూచించారు. స్టేషన్‌కు వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించి వారి సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించాలన్నారు. గ్రామాల్లో ఘర్షణలు, దౌర్జన్యాలు, మహిళలపై వేధింపులు, ఈవ్‌టీజింగ్ వంటి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రాత్రి వేళల్లో గ్రామాల్లో గస్తీ తిరుగుతూ అనుమానితులను విచారించాలన్నారు. ఈ సందర్భంగా మడకశిర నియోజకవర్గంలో పండే పంటల వివరాలను కూడా ఎస్పీ తెలుసుకున్నారు. ఎస్పీ వెంట సీఐ సురేష్‌బాబు, అగళి ఎస్‌ఐ లావణ్య, రొళ్ల ఎస్‌ఐ వెంకటరమణ, రొద్దం ఎస్‌ఐ నాగస్వామి, సిబ్బంది ఉన్నారు.