
వైఎస్సార్ ఆసరా సంబరాల్లో మహిళలు (ఫైల్)
మహిళాభ్యుదయమే ధ్యేయంగా జగన్ సర్కార్ పాలన సాగిస్తోంది. ప్రతి పథకంలోనూ మహిళలను భాగస్వాములను చేస్తూ పెద్దపీట వేస్తోంది. ముఖ్యంగా మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్న అక్కచెల్లెమ్మలకు ఆర్థిక అండనిస్తోంది. రుణమాఫీ కింద ‘వైఎస్సార్ ఆసరా’ ద్వారా ఇప్పటికే రెండు విడతల సొమ్ము జమ చేసిన ప్రభుత్వం... తాజాగా మూడో విడత నిధులు విడుదల చేస్తోంది.
పుట్టపర్తి అర్బన్: స్వయం సహాయక సంఘాల్లోని అక్కా చెల్లెమ్మలకు వైఎస్ జగన్ అండగా నిలుస్తున్నారు. 2019 ఏప్రిల్ 11 నాటికి బ్యాంకు లింకేజీ ద్వారా పొందిన రుణాన్ని నాలుగు విడతల్లో మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి... ఇచ్చిన మాట ప్రకారం ‘వైఎస్సార్ ఆసరా’ క్రమం తప్పకుండా అమలు చేస్తున్నారు. ఇప్పటికే రెండు విడతల రుణమాఫీ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. తాజాగా ఈనెల 25వ తేదీన మూడో విడత అందజేయడానికి రంగం సిద్ధం చేశారు. ఈ క్రమంలో ఈనెల 20వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకూ జిల్లా వ్యాప్తంగా ‘ఆసరా’ సంబరాలు నిర్వహిస్తున్నారు. వైకేపీ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి మహిళా సంఘాల్లోని సభ్యులకు బొట్టుపెట్టి సంఘానికి ఎంత మొత్తం వచ్చింది...వ్యక్తిగతంగా ఎంత మేర లబ్ధి కలిగిందనే విషయాలు తెలియజేస్తున్నారు. అక్కడే డిజిటల్ రసీదులు సైతం అందజేస్తున్నారు. దీంతో ప్రతి మహిళకూ తనకు కలిగిన లబ్ధి గురించి తెలుస్తోంది.
జిల్లాలో 23,340 సంఘాలు..
జిల్లాలో 32 మండలాల పరిధిలో 23,340 డ్వాక్రా సంఘాలున్నాయి. ఇందులో సుమారు 2.33 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. వీరికి మూడో విడత ‘వైఎస్సార్ ఆసరా’ పథకం ద్వారా రూ.180.2 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. ఏటా క్రమం తప్పకుండా ‘ఆసరా’ మొత్తం ఖాతాల్లో జమ చేస్తూ ఆర్థికంగా చేయూత అందిస్తుండడంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మోసం చేసిన చంద్రబాబు..
టీడీపీ అధినేత చంద్రబాబు.. 2014 ఎన్నికలకు ముందు తాను అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక రూపాయి కూడా మాఫీ చేయలేదు. అప్పట్లో చంద్రబాబు మాటలు నమ్మి రుణాలు చెల్లించని మహిళా సంఘాల సభ్యులు బ్యాంకుల్లో డిఫాల్టర్‌లుగా మారి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కంతులు చెల్లించక పోవడంతో పొదుపు సంఘాలన్నీ దివాలా తీశాయి. బ్యాంకుల నుంతి నోటీసులు వచ్చాయి. దీంతో కొంత మంది బంగారు కుదువ పెట్టి మరీ కంతులు చెల్లించారు. కానీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఎవరూ అడక్కుండానే ‘వైఎస్సార్ ఆసరా’ అమలు చేస్తున్నారు. స్వయం సహాయక సంఘాలకు పూర్వ వైభవం తీసుకొస్తున్నారు.
బయోమెట్రిక్ తప్పనిసరి..
‘వైఎస్సార్ ఆసరా’ పథకం మూడో విడత లబ్ధిదారులకు ప్రభుత్వం బయోమెట్రిక్ తప్పనిసరి చేసింది. కొందరు మహిళలు రెండు, మూడేసి సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. దీంతో ఒక్కరికీ ఎక్కువ సాయం అందతుంది. దీన్ని అరికట్టి అందరికీ లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం వైకేపీ సిబ్బందితో మహిళా సంఘాల సభ్యులతో బయోమెట్రిక్ చేయిస్తోంది. అలాగే ఎవరైనా సభ్యురాలు మరణించి ఉంటే వారి నామినీల అకౌంట్లు తీసుకొని వారి వేలిముద్రలు సేకరిస్తున్నారు. దీంతో లబ్ధిదారులందరికీ న్యాయం జరగతుంది.
