
హిందూపురం: ఆ తల్లికి కొడుకు అంటే పిచ్చి ప్రేమ. కొడుకు లేకుంటే బతకలేను అనుకుంది. ఇటీవల కొడుకు అకాల మరణంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె.. కన్నా నువ్వు లేకుంటే బతకలేను అంటూ ప్రాణాలు తీసుకుంది. హృదయ విదారకమనిపించే ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... హిందూపురం పట్టణ పరిధిలోని కొట్నూరు బీసీ కాలనీకి చెందిన రామాంజి, బుజ్జమ్మ దంపతులు కూలి పనులతో జీవనం సాగిస్తున్నారు.
వీరి ఏకై క కుమారుడు (21) మగ్గం పనులతో కుటుంబానికి చేదోడుగా ఉండేవాడు. గత ఏడాది ఉగాది పండుగకు రెండు రోజుల ముందు క్రితం చిన్న కారణానికే కుమారుడు ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. కుమారుడి మరణంతో ఆ తల్లి మానసిక క్షోభకు గురైంది. తరచూ కుమారుడిని తలుచుకుని రోదిస్తుండేది. కుమారుడు లేకపోతే తాను బతకలేనని పలుమార్లు బంధువులతో చెప్పుకుని బాధపడేది.
ఈ క్రమంలో బుధవారం ఉదయం కుమారుడి జ్ఞాపకాలు వెన్నాడడంతో తీవ్ర వేదనకు లోనైన ఆమె విషపూరిత ద్రావకం తాగి, అపస్మారక స్థితికి చేరుకుంది. విషయాన్ని గమనించిన భర్త రామాంజి వెంటనే ఆమెను ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాడు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై హిందూపురం వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.