‘విచారణ’ పేరిట రెండేళ్లుగా కాలయాపన..? | - | Sakshi
Sakshi News home page

‘విచారణ’ పేరిట రెండేళ్లుగా కాలయాపన..?

Jun 3 2026 12:45 AM | Updated on Jun 3 2026 12:45 AM

దగదర్తి: మండలంలోని చెన్నూరు గ్రామ పంచాయతీ పరిధిలోని తిమ్మారెడ్డిపాళెం గత ఆరు దశాబ్దాలుగా నివాస ప్రాంతంగా కొనసాగుతోంది. సుమారు 50 కుటుంబాలు, 200 మందికి పైగా జనాభా అక్కడ స్థిర నివాసాలు ఏర్పరుచుకుని జీవిస్తున్నారు. ఇంటి పన్నులు చెల్లిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతున్నారు. కానీ ఆశ్చర్యకరంగా, వెబ్‌ల్యాండ్‌ సహా రెవెన్యూ రికార్డుల్లో ఆ ప్రాంతంలో గ్రామం ఉన్నట్లుగా నమోదు కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అవి ఇంటి స్థలాలు కావని, వ్యవసాయ భూములని వెబ్‌ల్యాండ్‌లో చూపిస్తోందని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ అధికారులు చెబుతుండడంతో గ్రామస్తులు విస్తుపోయారు.

భూములు ప్రజలవి.. పేర్లు బడాబాబులవి

చెన్నూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 177, 175ల్లో ఉన్న తిమ్మారెడ్డిపాళెం ప్రాంతం రికార్డుల్లో మాత్రం గ్రామస్తుల పేర్లకు బదులుగా ఇతరుల పేర్లతో నమోదై ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. కొందరు బడాబాబులు 2005–06 సంవత్సరాల్లో ఈ భూములను తమ పేర్లతో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నట్లు రెండేళ్ల క్రితం వెలుగుచూసింది. ప్రస్తుతం ఆ రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్ల ఆధారంగా చూపిస్తూ సాగులో ఉన్నామని పేర్కొంటున్నారని ఆరోపిస్తున్నారు. వాస్తవానికి సదరు సర్వేనంబర్ల భూముల్లో నివాసాలు ఉన్నాయి.

సాగు భూములుగా చూపించి రుణాలు

రికార్డుల్లో నమోదైనట్లు సాగు భూములుగా చూపించి తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి సుమారు రూ.30 లక్షల వరకు రుణాలు తీసుకున్నారనే ఆరోపణలు ఇప్పుడు మరింత సంచలనంగా మారాయి. ఒక వైపు గ్రామస్తులకు తమ ఇళ్లను రిజిస్ట్రేషన్‌ చేసుకునే హక్కు లేకుండా పోతుండగా, మరో వైపు అదే భూములపై రుణాలు మంజూరు చేయడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ రికార్డుల ప్రామాణికతపై గ్రామస్తులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

రుణాల భారం.. అధికారుల మౌనం

రికార్డుల్లో పేర్లు ఉన్న వ్యక్తులు తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకపోవడం వల్లే పేర్ల తొలగింపు ప్రక్రియ ముందుకు సాగడం లేదని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంలో కొందరు అధికారులను ప్ర భావితం చేసి వ్యవహారాన్ని అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణల్లో ఎంత నిజం ఉందో ఉన్నతాధికారుల సమగ్ర విచారణలోనే తేలాల్సి ఉంది. అయితే గ్రామస్తుల అనుమానాలు మాత్రం రోజు రోజుకు మరింత బలపడుతున్నాయి.

రామాలయ నమోదు సమయంలో బయటపడిన బాగోతం

రెండేళ్ల క్రితం గ్రామంలో నిర్మిస్తున్న శ్రీరామాలయానికి ప్రభుత్వ ఆర్థిక సహాయం పొందేందుకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ చేపట్టినప్పుడు అసలు విషయం వెలుగులోకి వచ్చినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామం పేరుతో రికార్డులు లేకపోవడం, నివాస ప్రాంతం స్థానంలో ఇతరుల పేర్లు నమోదై ఉండడం చూసి షాక్‌కు గురయ్యామని వారు అంటున్నారు. అప్పటి నుంచి మండల స్థాయి అధికారుల నుంచి కలెక్టర్‌ వరకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రెవెన్యూ రికార్డుల్లో ఊరే మాయం

ప్రజల పట్టాలపై పరాయి పేర్లు

60 ఏళ్ల చరిత్ర ఉన్న పల్లెకు

వెబ్‌ల్యాండ్‌లో చోటులేదు

గ్రామమని తెలిసీ వ్యవసాయ భూములుగా రిజిస్ట్రేషన్‌పై ఆరోపణలు

అదే భూములపై రూ.30 లక్షలకుపైగా బ్యాంకు రుణాలు

రెండేళ్లుగా విచారణ పేరుతో కాలయాపన

హక్కు కోసం ఎదురు చూపులు

ఇంటి స్థలాలకు రిజిస్ట్రేషన్‌ లేకపోవడంతో కుటుంబ అవసరాల కోసం బ్యాంకుల నుంచి రుణాలు పొందలేకపోతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. తరతరాలుగా నివసిస్తున్న తమ గ్రామానికి అధికారిక గుర్తింపు లేకపోవడం బాధాకరమని చెబుతున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి తిమ్మారెడ్డిపాళెంను రెవెన్యూ రికార్డుల్లో గ్రామంగా నమోదు చేయాలని, అక్రమ నమోదులపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు.

సమస్యపై పలుమార్లు వినతులు ఇచ్చినా అధికారులు ‘విచారణ చేస్తున్నాం’ అనే ఒకే సమాధానంతో కాలం గడుపుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రెండేళ్లు గడిచినా రికార్డుల్లో మార్పులు జరగకపోవడం, ఇటీవల నిర్వహించిన రీ సర్వేలో కూడా సమస్యను పరిష్కరించకపోవడం అధికార యంత్రాంగం పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement