నక్కలగండి దందా | - | Sakshi
Sakshi News home page

నక్కలగండి దందా

Jun 3 2026 12:45 AM | Updated on Jun 3 2026 12:45 AM

ఖాకీ అండ..

రూ.కోట్ల విలువజేసే మత్స్య సంపద స్వాహా

నియోజకవర్గ ముఖ్య నేత కనుసన్నల్లో వ్యవహారం

పోలీస్‌ అధికారి పర్యవేక్షణలో దందా

రిజర్వాయర్‌ వద్ద ఖాకీల కాపలా

రూ.కోట్లు కాజేసేందుకు పక్కాగా స్కెచ్‌

కొట్టేసేందుకు రంగం సిద్ధం..

నక్కలగండి రిజర్వాయర్‌లో మత్స్య సంపద భారీగా ఉందనే సమాచారం ముఖ్య నేతకు తెలిసింది. దీంతో వీటిని కొట్టేసేందుకు పక్కాగా స్కెచ్‌ వేశారు. ఈ వ్యవహారాన్ని నడిపే బాధ్యతను ఓ పోలీస్‌ అధికారికి అప్పజెప్పారని తెలుస్తోంది. దీంతో సదరు ఆఫీసర్‌ వెంటనే రంగప్రవేశం చేసి పామూరుకు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని తన దారికి తెచ్చుకున్నారనే టాక్‌ నడుస్తోంది. ప్రక్రియను సజావుగా నడిపేందుకు గానూ స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సొసైటీ సభ్యులను పిలిపించి మూడ్రోజుల క్రితం మాట్లాడారు. అక్కడేమి జరిగిందో తెలియదు గానీ మొత్తం మత్స్య సంపదలో వాటాను సభ్యులకు ఇచ్చేందుకు ఒప్పందం జరిగిందనే విషయం తెలుస్తోంది.

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: పచ్చ నేతలు బరితెగిస్తున్నారు. ఆదాయమొచ్చే ప్రతి దాన్నీ అడ్డుగోలుగా దోచేస్తున్నారు. ఇప్పటికే ప్రకృతి సంపదైన మట్టి, గ్రావెల్‌, ఇసుక నుంచి కాసులు పిండి రూ.కోట్లలో జేబులు నింపుకొంటున్నారు. ఇది చాలదనే రీతిలో ఎస్సీ, ఎస్టీల ఆధ్వర్యంలో నిర్వహించే మత్స్యకార సొసైటీలనూ వదలిపెట్టడం లేదు. వీరికి జీవనోపాధి కల్పించే చేపలను సైతం కొల్లగొడుతున్నారు.

లోపాలను ఆసరాగా చేసుకొని..

మత్స్యకార సొసైటీల్లో ఉన్న లోపాలను ఆసరాగా చేసుకొని వీరి పొట్టగొడుతున్నారు. తాజాగా వరికుంటపాడు మండలం నక్కలగండి రిజర్వాయర్‌లో రూ.కోట్ల విలువజేసే మత్స్యసంపదపై కన్నేసిన పచ్చ నేత ఓ పోలీస్‌ అధికారిని రంగంలోకి దింపారు. ఆయన కనుసన్నల్లో వ్యవహారాన్ని చక్కబెడుతున్నారనే ప్రచారం స్థానికంగా జరుగుతోంది.

అసలేమి జరుగుతోంది..?

వరికుంటపాడు మండలంలోని నక్కలగండి రిజర్వాయర్‌ పరిధిలో 12 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే కాలువలు అధ్వానంగా ఉండటంతో నీరు వదల్లేదు. దీంతో రిజర్వాయర్‌లో మూడేళ్లుగా నీరు పుష్కలంగా ఉండి మత్స్య సంపద భారీగా వృద్ధి చెందింది. రెండేళ్ల నుంచి చేపలను పట్టకపోవడంతో ఒక్కో దాని బరువు ఐదు నుంచి పది కిలోల వరకు చేరింది. దీంతో ఇక్కడ సుమారు రూ.రెండు కోట్ల విలువజేసే చేపలున్నాయని స్థానికులు చెప్తున్నారు.

ఇదీ తీరు..

రిజర్వాయర్‌ పరిధిలోని తూర్పు రొంపిదొడ్ల, మహ్మదాపురం, కాకొల్లువారిపల్లి, వేంపాడు గ్రామాలకు చెందిన 45 మంది ఎస్టీలు (యానాదులు) సొసైటీ సభ్యులుగా ఉన్నారు. పామూరుకు చెందిన ఓ ప్రైవేట్‌ వ్యక్తి వద్ద పెట్టుబడి తీసుకొని చేప పిల్లలను వేస్తూ.. వచ్చిన ఆదాయంలో కొంత మొత్తాన్ని తాము తీసుకునేవారు. పదేళ్లుగా ఈ విధానమే కొనసాగుతోంది. అయితే రెండేళ్ల క్రితం సదరు వ్యక్తి.. సొసైటీ సభ్యులకు ఓ మొత్తం (రూ.30 లక్షలు అని కొంత మంది సభ్యులు చెప్తున్నారు) ఇచ్చి తానే చేపలు పట్టుకునేలా ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో రిజర్వాయర్‌లో గతేడాది నీరు ఎక్కువగా ఉండటంతో వీటిని పూర్తి స్థాయిలో పట్టలేకపోయారు.

రెండ్రోజులుగా చేపల వేట

నక్కలగండిలో చేపల వేట రెండు రోజులుగా కొనసాగుతోంది. పట్టిన వీటిని పెద్ద కంటైనర్ల ద్వారా తరలిస్తున్నారు. పెద్ద సంఖ్యలో బెస్తవారిని పిలిపించి మత్స్య సంపదను దోచేస్తున్నారు. చేపల లెక్కలు పోలీసుల పర్యవేక్షణలో సాగుతోంది. అయితే ఈ విషయంలో తమ పాత్రేమీ లేదని, గొడవలు జరగకుండా ఉండేందుకే తామున్నామంటూ పోలీసులు సెలవిస్తున్నారు.

వృథాగా నీరు

ప్రాజెక్టులో చేపల వేటను త్వరలో ముగించేందుకు నీటిని కాలువలకు రాత్రి వేళ వదులుతున్నారు. వాస్తవానికి ఇక్కడ నీరుంటే భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండి రైతులకు మేలు జరుగుతుంది. అయితే మత్స్య సంపదను దోచే ఆలోచనలో ఇదేమీ పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

నక్కలగండి రిజర్వాయర్‌లో చేపల వేట

కంటైనర్‌లో చేపల లోడింగ్‌

Advertisement
 
Advertisement
Advertisement