ప్రజలను వంచించిన ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

ప్రజలను వంచించిన ప్రభుత్వం

Jun 3 2026 12:45 AM | Updated on Jun 3 2026 12:45 AM

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

‘వెన్నుపోటుకు రెండేళ్లు’

పోస్టర్ల ఆవిష్కరణ

నెల్లూరు రూరల్‌: హామీలను అమలు చేయకుండా ప్రజలను కూటమి ప్రభుత్వం వంచించిందని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు, ప్రత్యేక బుక్‌లెట్లను ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్‌, పార్టీ నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్‌రెడ్డి, పార్టీ మహిళా విభాగ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కాకాణి పూజిత తదితరులతో కలిసి మంగళవారం ఆవిష్కరించిన అనంతరం కాకాణి మాట్లాడారు. తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సూచనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా మూడు ముఖ్యమైన కార్యక్రమాలను గురువారం నుంచి నిర్వహించతలపెట్టామని చెప్పారు. ప్రజలు తీర్పునిచ్చిన జూన్‌ నాలుగును పురస్కరించుకొని, ప్రతి మండల కేంద్రంలో సదస్సులను నిర్వహించనున్నామని వెల్లడించారు. గత ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు.. ప్రతి కుటుంబానికీ ఇంత మొత్తంలో అందిస్తామంటూ బాండ్ల రూపంలో చేసిన ప్రమాణాలు.. పత్రిక ప్రకటనల ద్వారా ఇచ్చిన వాగ్దానాలను ఈ సదస్సుల్లో ప్రజల ముందుంచనున్నామని ప్రకటించారు. గడిచిన రెండేళ్లలో హామీలను అమలు చేయకుండా.. ప్రజలను ఎలా వంచించారో సమగ్రంగా వివరించనున్నామన్నారు. హామీల ప్రతులను జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో గురువారం దహనం చేయనున్నామని వెల్లడించారు. వెన్నుపోటుకు రెండేళ్ల కార్యక్రమంలో భాగంగా జూన్‌ 8, 9న ప్రత్యేక సదస్సులను నిర్వహించనున్నామని తెలిపారు. ఇవన్నీ ఇండోర్‌ సమావేశాలుగా జరపనున్నామని.. విద్యార్థులు, యువత, మహిళలు, నిరుద్యోగులు, అన్ని వర్గాల ప్రజలతో కలిసి ముఖాముఖి చర్చా కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని వివరించారు. ఈ మోసాలను ప్రజల్లోకి ఏ విధంగా బలంగా తీసుకెళ్లాలనే అంశంపై చర్చించనున్నామని పేర్కొన్నారు.

12న ర్యాలీలు, నిరసనలు

చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు అనే పేరుతో భారీ ఎత్తున ర్యాలీలు, నిరసనలను ఈ నెల 12న ప్రతి నియోజకవర్గ కేంద్రంలో‘ చేపట్టనున్నామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఏ విధంగా మోసం చేశారు.. గత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అందించిన సంక్షేమ పథకాలపై ఈ బుక్‌లో వివరించామన్నారు. తమ ప్రభుత్వ హయాంలో రూ.లక్షల కోట్లతో అన్ని వర్గాలకు ఎంతో మేలు చేశామని తెలిపారు.

హామీల అమల్లో విఫలం

సూపర్‌ సిక్స్‌ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చాక వీటిని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. వీటిపై కనీస బాధ సైతం లేకుండా.. ప్రజలకు మొహం ఎలా చూపాలనే ఆలోచన సైతం చేయకుండా బహిరంగ సభలను నిర్వహిస్తున్నారని ఆరోపించారు. సూపర్‌ సిక్స్‌.. సూపర్‌ హిట్‌ అంటూ మహానాడులో ప్రకటించుకోవడం ఆయనకే చెల్లిందని విమర్శించారు. ఇప్పటికే మూడు బడ్జెట్లు దాటిపోయాయని, మిగిలిన రెండు విడతల్లోనూ వీటినిచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ధ్వజ మెత్తారు. మొదట్లో ఒక సిలిండర్‌ ఇచ్చి, ఆ తర్వాత మూడింటికి సంబంధించిన డబ్బులను ఒకేసారి వేస్తామని రకరకాలుగా మాట మార్చారని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వ హయాంలో ఆర్నెల్లకోసారి పింఛన్లను మంజూరు చేస్తూ పేదలను ఆదుకునేవారని గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం కొత్త పింఛన్లను ఒక్కటి సైతం మంజూరు చేయకపోగా, ఉన్న వాటికి కోత విధిస్తూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. కూటమి సర్కార్‌లో ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకునేవారు లేక విద్యావ్యవస్థ వెలవెలబోతోందని విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సకాలంలో అందించకుండా.. ఉన్నత చదువులను అభ్యసించాలనుకునే పేద విద్యార్థుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లుతోందన్నారు.

మోసాలకే ఒక పుస్తకం

ప్రజలకు చంద్రబాబు చేసిన మోసాలు ఎంత చెప్పినా సరిపోవని, వీటిని వివరించాలంటే ఒక పుస్తకమే రాయాల్సి వచ్చిందని కాకాణి పూజిత పేర్కొన్నారు. ఆయన ద్రోహాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని, బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని ఆరోపించారు. అధికార పార్టీకి చెందిన వారు తప్పు లు చేసినా వెనుకేసుకొస్తున్నారని, అదే సా మాన్యులపై దాడులు జరిగితే కనీస శిక్షలూ పడటంలేదని విమర్శించారు. అనంతరం విజయకుమార్‌రెడ్డి మాట్లాడారు. వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మహిళా విభాగ రాష్ట్ర జోనల్‌ అధ్యక్షురాలు గౌరి, జిల్లా మహిళాధ్యక్షురాలు లక్ష్మీసునంద తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement