మాజీ ఉపరాష్ట్రపతి రాక రేపు | - | Sakshi
Sakshi News home page

మాజీ ఉపరాష్ట్రపతి రాక రేపు

Jun 3 2026 12:45 AM | Updated on Jun 3 2026 12:45 AM

నెల్లూరు రూరల్‌: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈనెల 4 నుంచి 6వ తేదీ వరకు జిల్లాలో పర్యటిస్తారని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 4న ఉదయం రోడ్డు మార్గంలో వెంకటాచలం మండలంలోని స్వర్ణభారత్‌ ట్రస్ట్‌కు వెళ్తారన్నారు. సాయంత్రం 5 గంటలకు నెల్లూరులో దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ కార్యక్రమానికి విచ్చేస్తారన్నారు. 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా స్వర్ణభారత్‌ ట్రస్ట్‌లో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. 6న ఉదయం హైదరాబాద్‌కు బయలుదేరనున్నట్లు వెల్లడించారు. మాజీ ఉపరాష్ట్రపతి పర్యటన సందర్భంగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశానన్నారు.

మందుబాబుకు

మహిళల దేహశుద్ధి

చేజర్ల: మండలంలోని ఆదూరుపల్లి కూడలిలో మంగళవారం ఓ మందుబాబు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో వారు దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల కథనం మేరకు.. దాచూరు నుంచి బద్వేల్‌కు వెళ్తున్న మహిళలు ఆదూరుపల్లిలో బస్సు కోసం వేచి చూస్తున్నాడు. ఫూటుగా మద్యం తాగిన ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించడంతో మహిళలందరూ కలిసి చితకబాదారు. మందుబాబును పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

ఉసురు తీసిన లారీ

కావలి: జలదంకి నుంచి కావలికి మోటార్‌బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని లారీ ఢీకొట్టడంతో మృతిచెందాడు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. జలదంకికి చెందిన తన్నీరు మాల్యాద్రి (45) తన స్వగ్రామంలో వ్యవసాయ పనులు చేస్తుంటాడు. అదే విధంగా బేల్దారి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మంగళవారం మాల్యాద్రి పనుల నిమిత్తం కావలికి బైక్‌పై బయలుదేరాడు. ఈ క్రమంలో ఉదయగిరి బ్రిడ్జి సెంటర్‌లో వెళ్తున్న మాల్యాద్రిని వెనుక వైపు నుంచి లారీ ఢీకొట్టింది. దీంతో లారీ చక్రాల కింద పడి అతను అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా వైద్యశాలకు తరలించారు.

నాకు దిక్కెవరు బిడ్డా..

సెలవుల నేపథ్యంలో పనికెళ్లిన బాలుడు

ఏడో అంతస్తు పైనుంచి కిందపడి మృతి

తల్లడిల్లిన కన్నపేగు

నెల్లూరు(క్రైమ్‌): ఆ బాలుడికి తండ్రి లేడు.. తల్లి కష్టపడి చదివిస్తోంది. వేసవి సెలవులు కావడంతో పనికెళ్లి కుటుంబానికి అండగా ఉండాలని భావించాడు. అయితే విధి మరోలా తలిచింది. ప్రమాదవశాత్తు ఏడో అంతస్తు పైనుంచి కిందపడటంతో బాలుడు తీవ్రగాయాలై మృతిచెందాడు. దీంతో కన్నపేగు విలవిల్లాడిపోయింది. నాకు దిక్కెవరయ్యా అంటూ ఆమె కన్నీరుమున్నీరుగా రోదిస్తోంది. పోలీసుల కథనం మేరకు.. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా గోపీనాథ్‌పూర్‌ మండలానికి చెందిన ఎన్‌.మహాలక్ష్మి తన కుమారుడు రాము (15)తో కలిసి వెంకటాచలం మండలం బురాన్‌పూర్‌లో నివాసం ఉంటోంది. ఆమె భర్త పున్నయ్య కొన్ని సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. మహాలక్ష్మి పనులు చేసుకుంటూ కుమారుడిని చదివిస్తోంది. రాము ఇటీవల పదోతరగతి పూర్తి చేశాడు. వేసవి సెలవులు కావడంతో బంధువులతో కలిసి మంగళవారం పొగతోటలో నూతనంగా చేపట్టిన కాసా హాస్పిటల్లో భవన నిర్మాణ పనులకు వెళ్లాడు. రాము ప్రమాదవశాత్తు ఏడో అంతస్తు పైనుంచి కిందపడటంతో తీవ్రగాయాలయ్యాయి. సహచరులు చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించి బాధిత తల్లికి సమాచారం అందించారు. రామును పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. హాస్పిటల్‌కు చేరుకున్న బాధిత తల్లి విగతజీవిగా పడి ఉన్న కుమారుడిని చూసి కన్నీటి పర్యంతమైంది. మహాలక్ష్మి ఫిర్యాదు మేరకు చిన్నబజారు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి ఎస్‌ఐ అబ్దుల్‌ రజాక్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement