● అనుకూలమైన వారికి వచ్చేలా
వ్యవహరిస్తున్న వైనం
నెల్లూరు సిటీ: ఆర్టీసీ టెండర్ల ప్రక్రియలో కొందరు మాత్రమే లబ్ధిపొందేలా అధికారులు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. తమ వారికి అనుకూలంగా.. కాని వారికి టెండర్‌లు దక్కకుండా చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. నెల్లూరు ప్రధాన ఆర్టీసీ బస్టాండ్‌లో జిల్లా ఓపీఆర్‌ఎస్(ఆన్‌లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్)ను ఏడాదిగా నామినేషన్ కింద ఓ కాంట్రాక్టర్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ అధికారులు ఇటీవల ఓపీఆర్‌ఎస్‌కు టెండర్‌లు పిలిచారు. మొత్తం 8 మంది కాంట్రాక్టర్లు ప్రక్రియలో పాల్గొన్నారు. శనివారం ఆ టెండర్ బాక్సులను ఓపెన్ చేశారు. అత్యధికంగా రూ.56 వేలకు అదే కాంట్రాక్టర్ టెండర్‌ను దక్కించుకున్నారు. కాగా స్కూటర్, సైకిల్ పార్కింగ్‌కు టెండర్ల ప్రక్రియ జరగ్గా, సదరు కాంట్రాక్టర్ మాత్రమే పాల్గొనడం విశేషం. దీనికి కేవలం రూ.62 వేలకే అతను టెండర్ వేశారు. గతంలో ఇదే కాంట్రాక్ట్‌ను రూ.1,0,2000లకు పలికింది. ఒక్క సింగిల్ కాంట్రాక్టర్ రావడం వెనుక ఏమైనా అధికార పార్టీ నేత ఒత్తిళ్లు ఉన్నాయా అనేది ప్రశ్నార్థకరంగా మారింది. ఈ కాంట్రాక్టర్ ఆత్మకూరు బస్టాండులో గతంలో కూడా ఒక కాంట్రాక్టర్‌కు వచ్చిన టెండర్‌ను రద్దు చేసి క్లీనింగ్, స్వీపింగ్ టెండర్‌ను పొలిటికల్ ఒత్తిళ్లతో నామినేషన్ మీద ప్రస్తుతం పనిచేస్తున్నట్లు సమాచారం. అధికారులు టెండర్‌ల ప్రక్రియను అనుకూలమైన వారికే వచ్చేలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
నిబంధనల ప్రకారమే నిర్వహణ
ఆర్టీసీ టెండర్‌లను నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్నాం. సింగిల్ టెండర్‌తో దక్కించుకున్న వారికి గతంలో వచ్చిన దాని కంటే ఎక్కువ చెల్లిస్తేనే టెండర్‌ను ఇస్తాం. లేకుంటే రీటెండర్‌ను నిర్వహిస్తాం.
– షేక్ షమీమ్, జిల్లా ప్రజా రవాణా అధికారి


