అయ్యా.. మా వినతులు చూడండి | - | Sakshi
Sakshi News home page

అయ్యా.. మా వినతులు చూడండి

Mar 31 2026 7:20 AM | Updated on Mar 31 2026 7:20 AM

కలెక్టరేట్‌లో

‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’

పోటెత్తిన అర్జీదారులు

నెల్లూరు(దర్గామిట్ట): ‘అయ్యా.. చాలాదూరం నుంచి వచ్చాం. మా వినతుల్ని పరిశీలించి పరిష్కారం చూపండి’ అంటూ ప్రజలు కోరారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కలెక్టర్‌ హిమాన్షు శుక్లా, డీఆర్వో విజయ్‌కుమార్‌, నెల్లూరు ఆర్డీఓ అనూష, తెలుగుగంగ స్పెషల్‌ కలెక్టర్‌ హరిశ్చంద్రారెడ్డి, సర్వే ల్యాండ్‌ రికార్డ్స్‌ డిప్యూటీ డైరెక్టర్‌ నాగశేఖర్‌ తదితరులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ భూ సమస్యలు, పింఛన్లకు సంబంధించి అర్జీలు ఎక్కువగా వస్తున్నాయని, వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు.

5 రకాల బస్సుల్లోనే ప్రయాణం అన్యాయం

ఆర్టీసీ 16 రకాల బస్సులను నడుపుతున్నా దివ్యాంగ శక్తి పథకం కింద కేవలం 5 రకాల బస్సుల్లోనే ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం అన్యాయని వైఎస్సార్‌సీపీ జిల్లా దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు చెల్లా మోహన్‌ విమర్శించారు. డీఆర్వో విజయ్‌కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె వెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ సేవలకే పరిమితం చేయడం దివ్యాంగుల హక్కులను పరిమితం చేయడమేనన్నారు. సీఎం పథకం ప్రకటించిన సమయంలో అన్ని సర్వీసుల్లో ఉచిత ప్రయాణం అందిస్తామన్నారు. ఇప్పుడు పరిమితం చేయడం దారుణమన్నారు. గతంలో ఉన్న 50 శాతం రాయితీపై మరో 50 శాతం కలిపి పూర్తి ఉచితం చేసినట్టుగా ప్రచారం చేసుకోవడం సరికాదన్నారు. కార్యక్రమంలో నాగేంద్ర, సుబాన్‌బాషా, ప్రభు తదితరులు పాల్గొన్నారు.

విచారణకు డిమాండ్‌

రాపూరు మండలం తెగచర్ల గ్రామ సంఘ బంధం నిధుల గోల్‌మాల్‌పై విచారణ చేపట్టాలని పొదుపు మహిళలు వినతిపత్రం అందజేశారు. సంఘ బంధ అధ్యక్షురాలు, రాపూరు ఏపీఎం సహకారంతో నిధులు గోల్‌మాల్‌ చేసిందన్నారు. విచారణ చేపట్టాలని కోరారు.

రైతులను ఆదుకోవాలంటూ..

ధాన్యం పండించిన రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించాలంటూ భారత చైతన్య యువజన పార్టీ జిల్లా అధ్యక్షుడు బుధవరపు బాలాజీ నేతృత్వంలో నేతలు కలెక్టరేట్‌ వద్ద నిరసన చేపట్టారు. మిల్లర్లు, దళారుల అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్‌ చేశారు. కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. డాక్టర్‌ గుంజి నరసింహారావు, వేల్పుల రామ్మోహన్‌, సోమ గోపాల్‌, హరినాథ్‌, కొణిదెల నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement