● ఓ మహిళ ఫిర్యాదు
● పోలీస్ కార్యాలయంలో
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’
నెల్లూరు(క్రైమ్): ‘చిన్న కుమారుడు చెడు వ్యసనాలకు బానిసై నన్ను కొట్టడమే కాకుండా ఇంట్లో నుంచి గెంటేశాడు. విచారించి తగిన చర్యలు తీసుకోవాలి’ అని కొడవలూరు ప్రాంతానికి చెందిన ఓ మహిళ విజ్ఞప్తి చేశారు. నెల్లూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. 126 మంది తమ సమస్యలను వినతుల రూపంలో ఎస్పీ అజిత వేజెండ్లకు అందజేశారు. వాటిని పరిశీలించిన ఆమె చట్టపరిధిలో విచారించి న్యాయం చేస్తామని బాధితులకు భరోసానిచ్చారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ యు.సత్యనారాయణ, మహిళా స్టేషన్, పీసీఆర్, ఎస్‌బీ 2 ఇన్‌స్పెక్టర్లు టీవీ సుబ్బారావు, భక్తవత్సలరెడ్డి, బి.శ్రీనివాసరెడ్డి, ఫిర్యాదుల విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వినతుల్లో కొన్ని..
● ఈ ఏడాది ఫిబ్రవరి 21వ తేదీన మా తండ్రి లారీ ఢీకొని మృతిచెందాడు. వెంకటాచలం పోలీసులు కేసు నమోదు చేశారు. విచారించి తగిన చర్యలు తీసుకోవాలని వెంకటాచలానికి చెందిన ఓ వ్యక్తి కోరాడు.
● ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని వంశీకృష్ణ అనే వ్యక్తి రూ.3.75 లక్షల నగదు తీసుకున్నాడు. ఉద్యోగం ఇప్పించకుండా, నగదు తిరిగివ్వకుండా మోసగించాడని వరికుంటపాడు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు.
● వెంకయ్య అనే వ్యక్తి నా కుమార్తెను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని వెంటబడి వేధిస్తున్నాడు. ఆమైపె చెడుగా ప్రచారం చేస్తుండగా అడిగినందుకు నాపై, కుటుంబ సభ్యులపై దాడిచేసి గాయపరిచాడు. విచారించి న్యాయం చేయాలని బిట్రగుంట ప్రాంతానికి చెందిన ఓ మహిళ విజ్ఞప్తి చేశారు.
● భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని నన్ను, పిల్లలను పట్టించుకోలేదు. ఇటీవల మమ్మల్ని కొట్టి ఇంట్లో నుంచి గెంటేశాడని బుచ్చిరెడ్డిపాళెం ప్రాంతానికి చెందిన ఓ మహిళ అర్జీ సమర్పించారు.
● భర్త, అత్తింటివారు ప్రతి చిన్న విషయానికి నన్ను ఇబ్బందులు పెడుతున్నారు. తగిన చర్యలు తీసుకోవాలని నవాబుపేట ప్రాంతానికి చెందిన ఓ వివాహిత కోరారు.


