పొదలకూరు: పట్టణంలోని వెంకటేశ్వరనగర్‌లో నివాసం ఉంటున్న ముత్తంగి వెంకటేశ్వర్లు అంత్యక్రియలను అశ్రునయనాల నడుమ నిర్వహించారు. ఆయన అవశేషాలను నివాసానికి ఉదయం 11.30కు తీసుకొచ్చారు. కుటుంబసభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. తల్లి అచ్చెమ్మ, భార్య మమత, పిల్లలు భార్గవి, స్వాతి, శ్రీనాథ్, సోదరి సంపూర్ణ, సోదరుల రోదనలతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అంత్యక్రియలకు మండల స్థాయి అధికారులు, పోలీసులు హాజరయ్యారు. తహసీల్దార్ శివకృష్ణయ్య, ఎంపీడీఓ నరసింహరావు, సీఐ గుత్తి వెంకట్రావు, ఎస్సై హనీఫ్ దగ్గరుండి అంత్యక్రియలను పూర్తి చేయించారు. అధికారుల రాకను చూసి మృతుడి బంధువులు, కుటుంబసభ్యులు పెద్ద ఎత్తున రోదించి తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.


