● రిలయన్స్ బయో గ్యాస్ ప్లాంట్ ఎదుట పెయ్యలపాళెం గ్రామస్తుల ఆందోళన
కొడవలూరు: కాలుష్యం భారీ నుంచి మా ప్రాణాలను కాపాడంటూ మండలంలోని పెయ్యలపాళెం గ్రామస్తులు డిమాండ్ చేశారు. గ్రామంలోని రిలయన్స్ బయో ఎనర్జీ లిమిటెడ్ (కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్) ఎదుట గ్రామస్తులు శనివారం గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామానికి ఆనుకొనే ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారని, ఈ ఫ్యాక్టరీలో పేడ, గడ్డి ఉపయోగించి బయో గ్యాస్ ఉత్పత్తి చేస్తున్నారని తెలిపారు. దీని వల్ల ఫ్యాక్టరీ నుంచి భారీ శబ్దాలు వస్తూ దుర్వాసన చిమ్ముతోందన్నారు. శబ్ద కాలుష్యంతోపాటు వాయు కాలుష్యం గ్రామాన్ని కమ్మేస్తుందన్నారు. వీటితోపాటు అప్పుడప్పుడు దుర్వాసనతో కూడిన గ్యాస్‌ను బయటకు వదలడం వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామన్నారు. రాత్రిళ్లు శబ్దాలకు పిల్లలు చదవ లేకపోతున్నారన్నారు. వాయు కాలుష్యంతో గ్రామస్తులు అనారోగ్యాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై ఈ నెల 18న గ్రామ సర్పంచ్ పెనాక అనూష ద్వారా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినప్పటి అధికారులూ ఫ్యాక్టరీ వైపు కన్నెత్తి చూడలేదని విచారం వ్యక్తం చేశారు. సర్పంచ్ పెనాక అనూష మాట్లాడుతూ ఫ్యాక్టరీ ఏర్పాటుకు పంచాయతీకి సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని, ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరగలేదన్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటు సమయంలో గ్రామం తరఫున కాలుష్యం విషయమై ప్రశ్నిస్తే వైట్ కేటగిరీ పొల్యూషన్ సర్టిఫికెట్ కలిగి ఉన్నామని, అందువల్ల ఎలాంటి పొల్యూషన్ ఉండదని ఫ్యాక్టరీ ఇన్‌చార్జ్ సతీష్ తెలిపారన్నారు. తీరా చూస్తే వివిధ రకాల పొల్యూషన్‌లతో గ్రామాన్ని చిదిమేస్తోంది.
నిర్లక్ష్యంగా ఫ్యాక్టరీ ప్రతినిధి వైఖరి
ఫ్యాక్టరీ ఎదుట నిరసన తెలుపుతున్న గ్రామస్తులతో మాట్లాడేందుకు వచ్చిన ఫ్యాక్టరీ ప్రతినిధి శ్రీనివాసన్ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ వెళ్లారు. గోడు చెప్పుకొంటుంటే ఏమీ పట్టనట్లు ప్రతినిధి నిర్లక్ష్యంగా వ్యవహరించడం గ్రామస్తులకు మరింత ఆవేదన కలిగించింది.


