సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి
● ఆటో కార్మికుల భారీ ర్యాలీ
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఆటో కార్మికులకు భద్రతతో కూడిన సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కోరుతూ వారు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సీఐటీయూ నెల్లూరు రూరల్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం అయ్యప్పగుడి సెంటర్ నుంచి పొదలకూరు రోడ్డు, డైకస్‌రోడ్డు, బొల్లినేని సెంటర్ మీదుగా కేవీఆర్ పెట్రోల్ బంకు వరకు భారీ ర్యాలీ చేశారు. ఆటో కార్మిక సంఘం రూరల్ గౌరవాధ్యక్షుడు నరసింహారెడ్డి, జిల్లా అధ్యక్షుడు సురేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్టీసీ తర్వాత ఆటో రంగం ప్రజలకు సేవలందిస్తోందన్నారు. ఈ రంగంలో నిరుద్యోగులు, యువత ఎక్కువ మంది ఉన్నారని, గత 30 ఏళ్లుగా ఆటో కార్మికులకు ఏమైనా ప్రమాదం సంభవిస్తే ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదని వాపోయారు. కూటమి ప్రభుత్వం రవాణా రంగంపై విపరీతమైన ఆర్థిక భారాలు మోపుతోందని, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లకు సంబంధించి ప్రైవేటు సంస్థలకు అనుమతులు ఇవ్వడంతో ఆటో రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్ర పన్నుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను మార్చి కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్‌కోడ్స్‌ను తీసుకొచ్చి కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తోందన్నారు. దీనిపై ఈనెల 12వ తేదీన దేశ వ్యాప్తంగా నిర్వహించ తలపెట్టిన సార్వత్రిక సమ్మెలో ఆటో కార్మికులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయా లని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ నేతలు ఎం.సుధాకర్, పెంచలనరసయ్య, యూనియన్ రూరల్ నాయకులు ప్రసాద్, పెంచలయ్య, లవకుమార్, శివాజీ, కోటేశ్వరరావు, శివ, మురళి, ముని, కృష్ణారెడ్డి, హమీద్, సత్యం, ఆదిశేషయ్య, సత్యం తదితరులు, పాల్గొన్నారు.
సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి


