ఆటోనగర్‌లో అగ్ని ప్రమాదం
నెల్లూరు(క్రైమ్): నగరంలోని ఆటోనగర్‌లో రెండు దుకాణాల్లో శనివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అగ్నిమాపక సిబ్బంది సమాచారం మేరకు.. ఆటోనగర్ ఐఎల్ రెడ్డి లేఅవుట్‌లో షేక్.షాహుల్, అలీ అక్బర్‌లు ప్లాస్టిక్ వస్తువుల వేస్టేజ్ దుకాణాలు నిర్వహిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారో? ప్రమాదవశాత్తో.. కారణం తెలియదు కాని శనివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటచేసుకుంది. ప్లాస్టిక్ వస్తువులు కావడంతో మంటలు దట్టంగా వ్యాపించాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఏడీఎఫ్‌ఓ రాజ ఆధ్వర్యంలో రెండు ఫైర్ ఇంజిన్లతో అగ్నిమాపక సిబ్బంది చంద్రశేఖర్, శ్రీనివాసులు, ఇలియాజ్, రాజేంద్ర, మధు తదితరులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో సుమారు 2.50 నుంచి మూడు లక్షల మేర ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని బాధితులు తెలిపారు.
ఆటోనగర్‌లో అగ్ని ప్రమాదం


