గనులు, భూగర్భ శాఖలో ఏసీబీ సోదాలు
● సర్వేయర్‌ను అదుపులోకి
తీసుకున్న ఏసీబీ అధికారులు
ఒంగోలు సిటీ: ఒంగోలులోని గనులు, భూగర్భ జలాల (మైన్స్ అండ్ జియాలజీ) శాఖ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో సర్వేయర్‌గా పనిచేస్తున్న షేక్ అబ్దుల్ ఆసిఫ్ ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్లు అందిన సమాచారం ఆధారంగా అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం మంగమూరు రోడ్డు వేద రెసిడెన్సీలోని కార్యాలయంలో సోదాలు చేపట్టిన ఏసీబీ బృందం ఆసిఫ్‌ను అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించింది. అతడిది మార్కాపురం కాగా కనిగిరిలో వివాహం చేసుకుని ప్రస్తుతం విజయవాడలో నివాసం ఉంటున్నట్లు సమాచారం. గతంలో కడప, కృష్ణా, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో పనిచేశాడు. నెల్లూరులో పనిచేస్తుండగా ఆదాయానికి మించి అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీకి పక్కా సమాచారం అందిన నేపథ్యంలో ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో ఈ దాడులు చేపట్టారు. ఆసిఫ్ నివాసం విజయవాడలో ఉండటంతో అక్కడి స్వగృహంతోపాటు మార్కాపురం, కనిగిరి, నెల్లూరు, గుంటూరుల్లోని బంధువుల ఇళ్లల్లో కూడా ఏకకాలంలో ఏసీబీ సోదాలు కొనసాగిస్తున్నారు. అక్రమ ఆస్తులకు సంబంధించి వివిధ డాక్యుమెంట్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అక్రమ ఆస్తుల్లో రెండు ఇళ్లు, ఒక ఇంటి స్థలం, 22 ఎకరాల వ్యవసాయ భూమి, రూ.2,82,264 నగదు, సుమారు 620 గ్రాముల బంగారం, సుమారు 500 గ్రాముల వెండి, రూ.3,54,000 ల ప్రాంసరీ నోట్లు, 16 చేతిగడియారాలు, ఒక మోటార్‌బైక్, విలువైన గృహోపకరణాలు ఉన్నాయన్నారు. ఇవికాక అసిఫ్ హెచ్‌డీఎఫ్‌సీ బీమాలో రూ.15 లక్షలతో పాలసీలు తీసుకొన్నట్లు చెప్పారు. అలాగే టొయోటా హై రైడర్ కారు కొనడానికి రూ.20 వేలు అడ్వాన్స్‌గా ఇచ్చినట్లు గుర్తించారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నట్లు తెలిపారు. ఒక లాకర్‌ను గుర్తించారు. సోదాల అనంతరం సర్వేయర్‌ను అరెస్ట్ చేసి నెల్లూరు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నట్లు చెప్పారు.


