నూతన మేయర్ ఎన్నిక జరపాలి
● రిలే దీక్షకు వివిధ సంఘాల మద్దతు
నెల్లూరు(దర్గామిట్ట): రాజ్యాంగబద్ధంగా నూతన మేయర్ ఎన్నిక నిర్వహించాలని వివిధ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. గిరిజన సంఘ ఐక్యవేదిక నెల్లూరులో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారంతో ఏడో రోజుకు చేరుకున్నాయి. రైతు సంఘం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యవేదిక, బీఎస్పీల నేతలు మద్దతు పలికారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి గంగపట్నం రమణయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. నెల్లూరు మేయర్ పదవి గిరిజన మహిళకు రాజ్యాంగబద్ధంగా కల్పిస్తే, దీనిని చూసి ఓర్వలేక జిల్లా నాయకులు మరో వర్గానికి చెందిన వ్యక్తికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడం బాధాకరమన్నారు. ఇదేనా బడుగు, బలహీనవర్గాలకు ఇచ్చే గౌరవమంటూ ప్రశ్నించారు. బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి నాసిన భాస్కర్‌గౌడ్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ స్పందించి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నేతలు చిన్న భాస్కర్‌గౌడ్, ఎల్వీ సుబ్బయ్య, ఎడ్ల రవి, బత్తెన లక్ష్మణ, శేఖర్, ఏడుకొండలు, చౌటురి శ్రీనివాసులు, శివకృష్ణ, వెంకటయ్య తలారి, కోవూరు సురేష్ తదితరులు పాల్గొన్నారు.


