గుండెపోటుతో కుప్పకూలిన టీచర్
● సీపీఆర్ చేసిన విద్యార్థి
ఉదయగిరి రూరల్: పాఠశాలలో గుండెపోటుకు గురై కుప్పకూలిన టీచర్‌కు ఓ విద్యార్థి సీపీఆర్ చేసిన ఘటన శుక్రవారం మండలంలోని గండిపాళెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగింది. స్థానికుల కథనం మేరకు.. గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో తెలుగు టీచర్‌గా కేసీ మాలకొండయ్య పనిచేస్తున్నారు. ఆయన శుక్రవారం విధులకు హాజరయ్యారు. ప్రార్థన సమయం ముగిసిన అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు తరగతి గదుల్లోకి వెళ్తుండగా ఒక్కసారిగా మాలకొండయ్య ఛాతిలో నొప్పితో కుప్పకూలారు. పదో తరగతి చదువుతున్న ఇస్కపల్లె గ్రామానికి చెందిన విద్యార్థి కంచర్ల వెంకటకిరణ్ సిద్ధార్థ సీపీఆర్ చేయడంతో మాలకొండయ్య ప్రాణాపాయ స్థితినుంచి బయటపడ్డారు. 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి చికిత్స నిమిత్తం ఉదయగిరి వైద్యశాలకు తరలించారు. అక్కడ్నుంచి మెరుగైన చికిత్స కోసం నెల్లూరు వైద్యశాలకు తరలించారు. వెంకటకిరణ్‌ను హెచ్‌ఎం రవీంద్ర, ఉపాధ్యాయులు వెంగళరావు, సురేష్, విష్ణు నారాయణ, నారాయ ణరావు తదితరులు అభినందించారు.


