దోచుకొనే మిషన్
వింజమూరు(ఉదయగిరి): ఇంటింటికీ సురక్షత నీరు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జల్‌జీవన్ మిషన్ పథకం నిధులు పక్కదారి పడుతున్నాయి. అధికారుల కక్కుర్తి, కాంట్రాక్టర్ల స్వార్థం వెరసి రూ.కోట్ల ప్రజాధనం స్వాహా అవుతోంది. దీనికి ఉదాహరణ వింజమూరులో జరుగుతున్న పనులు. ఆవాసాలు, అవసరం లేని ప్రభుత్వ లేఅవుట్లలో తూతూమంత్రంగా పనులు చేస్తూ నిధులు ఆరగిస్తున్నారు.
మండలంలో వివిధ పనులకు సంబంధించి రూ.1.84 కోట్లు జేజేఎం ద్వారా మంజూరయ్యాయి. చాకలికొండ లేఅవుట్‌కు రూ.16.20 లక్షలు, ఊటుకూరుకు రూ.13.20 లక్షలు, వింజమూరు సబ్‌స్టేషన్ వద్ద లేఅవుట్‌కు రూ.47 లక్షలు, దుత్తలూరు రోడ్డు మార్గంలో జాతీయ రహదారి వద్ద ఉన్న లేఅవుట్‌కు రూ.49.58 లక్షలు, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం ఉన్న మూడు లేఅవుట్లకు రూ.58 లక్షలు మంజూరయ్యాయి. వీటిలో జాతీయ రహదారి పక్కన ఉన్న లేఅవుట్ తప్ప మిగిలిన ఎక్కడా కూడా ఇళ్లు పూర్తి కాలేదు. ప్రజలు నివాసం ఉండటం లేదు. చిల్లచెట్లు పెరిగి అడవిని తలపిస్తున్నాయి. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విజిలెన్స్ విచారణ పేరుతో పనులు నిలిపివేశారు.
ఎవరి కోసం చేస్తున్నారు?
వింజమూరు – ఆత్మకూరు బైపాస్ సమీపంలో ఉన్న మూడు లేఅవుట్లలో సుమారు 250 మందికి పట్టాలు పంపిణీ చేశారు. వివిధ దశల్లో ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు ఆగిపోయాయి. దీంతో ప్రస్తుతం ఒక్కరు కూడా నివాసం లేరు. అదేవిధంగా ఊటుకూరు, చాకలికొండలో కూడా అదే పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ పనులు అవసరం లేదు. ప్రజలున్న గ్రామాలు, కాలనీల్లో జేజేఎం పనులు చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది. కానీ గ్రామీణ నీటి సరఫరా అధికారులు ఈ అంశాలు పరిగణలోకి తీసుకోకుండా ఎస్టిమేషన్లు వేసి, టెండర్లు పిలిచి, పనులు చేయిస్తున్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల పూర్తి చేశారు. అప్పుడే పలు లేఅవుట్లలో కుళాయిలు ధ్వంసమయ్యాయి.
జల్‌జీవన్ పథకం పేరుతో నిధుల స్వాహా
నివాసాల్లేని ప్రాంతాల్లో పనులు
కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కు
రూ.1.84 కోట్ల పనుల్లో అక్రమాలు
నాసిరకంగా పనులు
ఈ లేఅవుట్లలో చేస్తున్న పనులు నాసిరకంగా ఉన్నట్లు ఆరోపణలున్నాయి. పైపులైన్ వేసేందుకు తీసిన గుంతల్లో ఇసుక వేసి పూడాల్చి ఉండగా అలా జరగడం లేదు. తీసిన మట్టి పోసి పూడ్చుతున్నారు. కుళాయి దిమ్మెలు, సామగ్రి నాసిరకంగా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. బోర్లలో కొంచెం నీరు పడినా బిల్లులు పెడుతున్నారు. కానీ వాస్తవంగా కొన్ని బోర్లలో కనీసం అరగంట కూడా నీరు రావడం లేదు. ఇప్పుడే ఇలా ఉంటే వేసవిలో పరిస్థితి ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం వద్ద ఉన్న లేఅవుట్లలో మూడు బోర్ల పరిస్థితి ఇలాగే ఉంది. పనులపై విజిలెన్స్ విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని స్థానికులు కోరుతున్నారు.
దోచుకొనే మిషన్


