గిరిజనులపై చిన్నచూపు తగదు
● ఐదోరోజుకు రిలే నిరాహార దీక్షలు
నెల్లూరు(దర్గామిట్ట): గిరిజనులపై చిన్నచూపు తగదని పలువురు నేతలు అన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ నూతన మేయర్ ఎన్నికకు సంబంధించి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని గిరిజన నేత బాపట్ల వెంకటపతి యానాది డిమాండ్ చేశారు.
గిరిజన సంఘాలు చేపట్టిన రిలే నిరాహార దీక్ష బుధవారం ఐదోరోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జయవర్ధన్, బాపట్ల వెంకటపతి యానాదికి పెద్దఎత్తున గిరిజన సంఘాల నుంచి మద్దతు లభించింది. నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో గిరిజనులకు జరుగుతున్న అన్యాయంపై రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తామన్నారు. అలాగే న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తామన్నారు. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తే ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటామని జయవర్ధన్ హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల నాయకులు దీక్షకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో చేవూరు శ్రీనివాసులు యానాది, యాకసిరి మురళి, ఎందేటి సురేంద్ర పాల్గొన్నారు.


