ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి
సంగం: జిల్లా స్థాయిలో 20,468 ఇళ్లను పూర్తి చేయడానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పనులు చేయిస్తున్నారని హౌసింగ్ శాఖ ఈఈ మోహన్‌రావు తెలిపారు. మండలంలోని పలు లేఅవుట్లను ఆయన బుధవారం సందర్శించి ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. అనంతరం కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఆప్షన్ 3 కింద కాంట్రాక్టర్లు నిర్మించిన ఇళ్లలో నాణ్యతా లోపాలు ఉన్నాయని ఫిర్యాదుల నేపథ్యంలో క్వాలిటీ కంట్రోల్ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. 6,980 ఇళ్లలో లోపాలున్నట్లు గుర్తించామని వెల్లడించారు. 141 ఏజెన్సీలను బాధ్యులుగా గుర్తించగా, అందులో 67 ఏజెన్సీలు పనులు సరిచేయడానికి ముందుకు రావడం లేదన్నారు. వాటిపై పోలీసు కేసులు నమోదు చేసి ఖర్చులను రికవరీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆవాస్ ప్లస్ పథకం కింద మరో 6,000 ఇళ్లకు సంబంధించిన సర్వే పూర్తయ్యిందన్నారు. ఈనెల 13వ తేదీ లోపు వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నట్లు ఈఈ తెలిపారు. కార్యక్రమంలో ఏఈ గౌస్‌మొహిద్దీన్, సిబ్బంది పాల్గొన్నారు.


