రామాలయంలో చోరీ
● బంగారం, వెండి అపహరణ
కలువాయి(సైదాపురం): బంగారు, వెండి ధరలు పెరగడంతో కొందరు దుండగులు దేవస్థానాలను టార్గెట్‌గా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. కలువాయి మండలం తోపుగుంట అగ్రహారంలోని రామాలయంలో మంగళవారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. అమ్మవారి మెడలో ఉన్న నాలుగు గ్రాముల బంగారు మంగళసూత్రం, కేజీ వెండి వస్తువులు, హుండీలోని నగదు తస్కరించారు. బుధవారం ఆలయానికి వచ్చిన పూజారి చోరీ జరినట్లు గుర్తించారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై కోటయ్య ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. హుండీని పగులగొట్టి బయట గడ్డివాముల దగ్గర దుండగులు పడేశారు. హుండీలో సుమారు రూ.20 వేల నగదు ఉండొచ్చని భావిస్తున్నారు. ఘటన స్థలానికి క్లూస్‌టీమ్ వచ్చి వేలిముద్రలు సేకరించింది. మండలంలో జరుగుతున్న వరుస చోరీలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.


