అవినీతిలో కొత్త పుంతలు
తనఖాలో ఉన్న భూమికి రిజిస్ట్రేషన్ – కోవూరు సబ్ రిజిస్ట్రార్ నిర్వాకం
రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతి కొత్త పుంతలు తొక్కుతోంది. ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నా, ఏ మాత్రం లెక్కచేయకుండా అధికారులు అడ్డదారుల్లో వెళ్తున్నారు. ప్రభుత్వ భూములే కాకుండా బ్యాంక్ తనఖాల్లో ఉన్న వాటికి సైతం కాసులకు కక్కుర్తిపడి రిజిస్ట్రే షన్లు చేస్తుండటం విస్మయానికి గురిచేస్తోంది. తాజాగా కోవూరు సబ్ రిజిస్ట్రార్ తీరుపై బ్యాంక్ అధికారులు సీరియస్ అవ్వడం జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అక్రమాలకు అడ్డాగా మారాయి. ఏ మాత్రం జంకు బొంకు లేకుండా అడ్డదారుల్లో అధికారులు వెళ్తున్నారు. తాజాగా బ్యాంక్ తనఖాలో ఉన్న భూమిని కోవూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేశారు.
జరిగిందిదీ..
కోవూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలోని విడవలూరు మండలం ముదివర్తికి సంబంధించిన సర్వే నంబర్ 434లో దాదాపు మూడెకరాలకుపైగా భూమిని 2001లో అప్పటి ఆంధ్రా బ్యాంక్‌లో తనఖా పెట్టి రుణం తీసుకున్నారు. అప్పట్లో 146 – 2001, 147 – 2001 మార్ట్‌గేజ్ డాక్యుమెంట్ నంబర్లుగా ఉన్నాయి. వాస్తవానికి ఇవి 22 బీగా నమోదవుతాయి. ఈసీలో సైతం మార్ట్‌గేజ్ చేసినట్లుగా ఉంటుంది. బ్యాంక్ క్లియరెన్స్ ఇచ్చేంత వరకు వీటిని రిజిస్టర్ చేయకూడదు. అయితే స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ భూమిని 5053 – 2025 డాక్యుమెంట్ నంబర్‌గా సబ్ రిజిస్ట్రార్ ఇటీవల రిజిస్ట్రేషన్ చేశారు.
భారీగా చేతులు మారిన నగదు
నిజానికి భూమిని రిజిస్ట్రేషన్ చేయాలంటే ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తారు. భూమి స్థితిగతులు, వన్‌బీ, అడంగళ్‌తో పాటు ఈసీని నిశితంగా గమనిస్తారు. అయితే కోవూరు సబ్ రిజిస్ట్రార్ మాత్రం ఈసీని సైతం పరిశీలించకుండానే రిజిస్టర్ చేశారు. ఈ వ్యవహారం వెనుక భారీ మొత్తంలో చేతులు మారాయనే ప్రచారం జరుగుతోంది.
సీరియస్ అయిన అధికారులు
గతంలోని ఆంధ్రా బ్యాంక్ ప్రస్తుతం యూనియన్ బ్యాంక్‌గా రూపాంతరం చెందింది. తమ తనఖాలో ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేయడంపై అక్కడి అధికారులు సీరియస్ అయ్యారు. చట్ట విరుద్ధంగా ఇలా ఎలా చేస్తారంటూ ఆయన్ను నిలదీశారని తెలుస్తోంది. ఈ విషయమై రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా, చర్యలకు ఆ శాఖ వెనుకాడుతోందనే టాక్ నడుస్తోంది.
2001లోనే అప్పటి ఆంధ్రా బ్యాంక్ ద్వారా రుణం పొందిన వైనం
మార్ట్‌గేజ్‌లో ఉందని తెలిసినా క్లియరెన్స్
ఆగ్రహం వ్యక్తం చేసిన యూబీఐ అధికారులు
చర్యలకు వెనుకాడుతున్న
రిజిస్ట్రేషన్ శాఖ ఆఫీసర్లు
ఈసీ చూడకుండా
చేసింది వాస్తవమే
ఈసీ చెక్ చేయకుండానే రిజిస్ట్రేషన్ చేశాను. తప్పును తెలుసుకొని సరి చేసుకున్నా. బ్యాంక్‌కు లోన్‌ను చెల్లించేలా చేసి క్లియరెన్స్ ఇప్పించా.
– పెంచలయ్య, సబ్ రిజిస్ట్రార్, కోవూరు
అవినీతిలో కొత్త పుంతలు


