సీమ ఎత్తిపోతలపై వెనుకడుగేసేదిలేదు
● దీని సాధనే ధ్యేయంగా పనిచేస్తాం
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
పొదలకూరు: రాయలసీమ ఎత్తిపోతలపై వెనుకడుగేసే ప్రసక్తే లేదని, దీని సాధనే ధ్యేయంగా నిర్వహించే ఉద్యమాల్లో పాల్గొంటామని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని పొదలకూరు, భోగసముద్రంలో బుధవారం ఆయన పర్యటించారు. యూరియా సకాలంలో అందడంలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడారు. కూటమి పాలన అవినీతిమయంగా మారిందని ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పనులను నిలిపేయడాన్ని నిరసిస్తూ చలో పోతిరెడ్డిపాడుకు తమ పార్టీ గురువారం పిలుపునిచ్చిందని వెల్లడించారు. తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన ఎత్తిపోతల పథకాన్ని తిరిగి ప్రారంభించేంత వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూనే ఉంటామని చెప్పారు.
నాటికి.. నేటికీ మధ్య ఎంతో వ్యత్యాసం
రైతులు, ప్రజల సంక్షేమానికి కృషి చేసిన నాటి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి.. అన్నదాతలను అష్టకష్టాలకు గురిచేస్తున్న కూటమి సర్కార్‌కు మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని విమర్శించారు. కూటమి కక్షసాధింపులతో విసిగి వేశారిన ప్రజలు జగనన్న పాలనను కోరుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికలెప్పుడొచ్చినా జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావడం ఖాయమని తెలిపారు. ఆయన పర్యటనను అడుగడుగునా అడ్డుకునేందుకు పోలీసులను ఉసిగొల్పి, ఎక్కడా లేని నిబంధనలను సృష్టించి ప్రజలను నిలువరించేందుకు యత్నించారని మండిపడ్డారు. అయినా ప్రజలు భారీగా తరలిరావడం రేపటి రోజున తమ పార్టీ ఘన విజయానికి సంకేతమని పేర్కొన్నారు. జిల్లాలో పార్టీ కార్యకర్తలకు ఎలాంటి కష్టమొచ్చినా ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన పోరాటం చేస్తామన్నారు. యూరియా సకాలంలో అందక రైతులు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోందని వివరించారు. పొదలకూరుకు చెందిన వెన్నపూస సుందర్‌రెడ్డి.. భోగసముద్రంలో త్రోవగుంట ప్రసాద్‌నాయుడి తండ్రి మస్తాన్‌నాయుడి మృతి చెందడంతో వారి కుటుంబాలను పరామర్శించారు. సొసైటీ మాజీ చైర్మన్ గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ పెదమల్లు రమణారెడ్డి, వెన్నపూస జనార్దన్‌రెడ్డి, విష్ణు, వేణుగోపాల్‌రెడ్డి, అంజద్, శ్రీనివాసులురెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, శ్రీనారెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.


