ప్రధాన కార్యాలయానికి ఎంవీఐ అటాచ్
నెల్లూరు(టౌన్): జిల్లాలోని గూడూరులో ఎంవీఐగా పనిచేస్తున్న సునీల్‌రెడ్డిని విజయవాడలోని రవాణా శాఖ ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఆ శాఖ కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సునీల్ గూడూరులో రిలీవై ప్రధాన కార్యాలయంలో మంగళవారం రిపోర్టు చేసినట్లు సమాచారం.
కార్మికుడి ఆత్మహత్మ
కోట: ఆప్కో సంస్థలో కా ర్మికుడిగా పనిచేస్తున్న బాబుల్ హక్ (27) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై పవన్ కుమార్ కథనం మేరకు.. విద్యానగర్ వద్ద ఆప్కో సంస్థ ద్వారా సాగరమాల రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌కు చెందిన కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు. వారిలో బాబుల్ హక్ కూడా ఉన్నాడు. రెండు నెలల క్రితం పనిలో చేరాడు. సోమవారం రాత్రి భార్యతో ఫోన్‌లో మాట్లాడుతూ ఇద్దరూ పరస్పరం గొడవ పడినట్లు కార్మికులు చెబుతున్నారు. సమీపంలోని వంతెన వద్ద కమ్ములకు బాబుల్ హక్ ఉరేసుకుని ఉండటాన్ని మంగళవారం తెల్లవారుజామున గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్సై వివరాలు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
రెండు ఇసుక టిప్పర్ల సీజ్
కోవూరు: కోవూరు పరిసర ప్రాంతాల నుంచి ఎటువంటి పత్రాల్లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు టిప్పర్లను జాతీయ రహదారిపై లారీ యార్డు వద్ద మైన్స్ అండ్ జియాలజీ అధికారులు పట్టుకున్నారు. ఏడీ బి.రామచంద్రరావుకు అందిన ముందస్తు సమాచారంతో మంగళవారం తెల్లవారుజాము నుంచి నిఘా ఉంచారు. కోవూరు నుంచి ఒంగోలు వైపు ఇసుకను తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తదుపరి చర్యల నిమిత్తం వాహనాలను కోవూరు పోలీసుస్టేషన్‌లో అప్పగించారు. తనిఖీలు చేసే సమయంలో వాహనదారుల వద్ద ఎటువంటి వే బిల్లులు, మైనింగ్ అనుమతి పత్రాల్లేకపోవడం గమనార్హం. గతంలో ఎన్నడూ లేని విధంగా మైన్స్ అండ్ జియాలజీ శాఖ నేరుగా రంగంలోకి దిగి టిప్పర్లను సీజ్ చేయడం స్థానికంగా సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో ఉన్న సూత్రధారులెవరు? పట్టుబడిన టిప్పర్లు ఎవరివి? అనే కోణంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు.
ప్రధాన కార్యాలయానికి ఎంవీఐ అటాచ్


