పెద్దాస్పత్రిలో హెర్బల్ పార్కు
● సీఈఓ చంద్రశేఖర్
నెల్లూరు(అర్బన్): పేషెంట్ దగ్గరకే నేచర్ అనే కాన్సెప్ట్‌తో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (పెద్దాస్పత్రి)లో హెర్బల్ పార్కు ఏర్పాటు చేయనున్నట్టు ఏపీ ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్యాల బోర్డు సీఈఓ ఆవుల చంద్రశేఖర్ తెలిపారు. మంగళవారం ఆయన సూపరింటెండెంట్ డాక్టర్ మాధవితో కలిసి ఆస్పత్రి, మెడికల్ కళాశాల ఆవరణలోని ఖాళీ ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ తొలిదశలో జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రుల్లో హెర్బల్ పార్కుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టామన్నారు. నెల్లూరులో రెండెకరాల స్థలంలో పార్కును ఏర్పాటు చేస్తామన్నారు. వాకింగ్ ట్రాక్, బెంచీలు, పూలమొక్కలు, తాగునీటి వసతి, సీ్త్ర, పురుషులకు వేర్వేరుగా టాయిలెట్స్ ఉంటాయన్నారు. అశ్వగంధ, వేప, తులసి మొక్కలు నాటుతారన్నారు. ప్రభుత్వ నిధులతోపాటు దాతలు, పారిశ్రామికవేత్తల సహకారం తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ కో ఆర్డినేటర్ మడపర్తి శ్రీనివాసులు, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజేశ్వరి, ఉద్యానాధికారి సాయి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రదీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


