ప్రతిపక్ష పార్టీ మీడియా సాక్షిగా చూపించినా..
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికార పార్టీ ఎమ్మెల్యేల ధనదాహానికి పెన్నమ్మ శోకిస్తోంది. వీరి కనుసన్నల్లో తమ్ముళ్లు నదిని భారీ యంత్రాలతో కుళ్లబొడుస్తున్నారు. సోమశిల ప్రాజెక్ట్‌కు ముప్పు తప్పదని రైతుల ఆందోళన చేస్తున్నా.. ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు పర్యావరణాన్ని, ప్రాజెక్ట్, రైతాంగం భవిష్యత్‌ను పణంగా పెట్టి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ప్రకృతి సంపదను కాపాడడంతో పాటు పర్యావరణాన్ని, ప్రజల భద్రతను పరిరక్షించాల్సిన అధికార యంత్రాంగాలు ముడుపుల మత్తులో ముఖం చాటేస్తున్నాయి. కలువాయి మండలం తెలుగురాయపురం అక్రమ రీచ్‌లో జరుగుతున్న ఇసుక దందాను ప్రతిపక్ష నేతలు మీడియా సాక్షిగా బట్టబయలు చేసినా చలించడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
వందల టిప్పర్లు.. వేల టన్నులు
జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. పెన్నానదిలో అనధికార రీచ్‌లు ఏర్పాటు చేసుకుని భారీగా ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. ఉచిత ఇసుక విధానానికి ఎమ్మెల్యేలు, మంత్రులు తూట్లు పొడుస్తూ అక్రమ రవాణాకు గేట్లు తెరిచారు. వెంకటగిరి, ఆత్మకూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లో అక్రమ రవాణాకు అఽధికార యంత్రాంగం గ్రీన్ సిగ్నల్ వేయడంతో పబ్లిక్‌గా దోపిడీ జరుగుతోంది. ఓ వైపు ఇసుక అక్రమ రవాణా వల్ల లక్షల ఎకరాలకు పారుదల చేసే సోమశిల ప్రాజెక్ట్‌కు ముప్పు తప్పదని నిపుణులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నా.. అఽధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
తెలుగురాయపురంలో తగ్గేదేలా
అంటున్న ప్రజాప్రతినిధి
కలువాయి మండలం తెలుగరాయపురంలో కొన్ని నెలలుగా అనఽధికార రీచ్‌ను స్థానిక ప్రజా ప్రతినిధి ఓపెన్ చేశారు. నేరుగా నదిలోకి రోడ్డు వేయించి భారీ యంత్రం ద్వారా ఇసుక తోడేస్తున్నారు. రోజుకు వందల సంఖ్యలో టిప్పర్లు లోడింగ్ చేస్తున్నారు. తద్వారా రూ.12 లక్షలు జేబుల్లో వేసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు తుంగలో తొక్కి పర్యావరణానికి తూట్లు పొడుస్తూ ఇప్పటికే నదీ గర్భాన్ని 20 మీటర్ల వరకు తోడేస్తున్నారు. భారీ గోతులు ఏర్పడి భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోతున్నాయి. ఈ రీచ్‌కు కేవలం వంద మీటర్ల దూరంలో ఉన్న సోమశిల ప్రాజెక్ట్‌కు పెను ముప్పు తప్పదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. అనధికార రీచ్‌లో నేరుగా ప్రజాప్రతినిధి జోక్యం ఉండడంతో అధికార యంత్రాంగం సైతం కళ్లకు గంతలు కట్టేసుకున్నారు. ఇసుక లోడింగ్ చేసిన టిప్పర్లు నేరుగా కలువాయి మండల తహసీల్దార్ కార్యాలయం ముందు నుంచే వెళ్తున్నా రెవెన్యూ అధికారులకు కనిపించడంలేదు.
అధికార యంత్రాంగానికే సవాల్
జిల్లాలో జరిగే ఇసుక అక్రమ దందాపై అధికార పక్షానికి చెందిన ఎల్లోమీడియా సైతం గగ్గోలు పెడుతోంది. పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నారని, ప్రజాపక్షంలో ఉన్న నేతలు సైతం అక్రమ రవాణాను ఆధారాలతో సహా చూపిస్తున్నారు. ఇటీవల మాజీ మంత్రి కాకాణి గోవర్ధ న్‌రెడ్డి సైతం పక్కా ఆధారాలతో సహా విరువూరు రీచ్‌లో జరిగే ఇసుక దందాను చూపించారు. ఇంత జరుగుతున్నా కలెక్టర్, ఎస్పీ సైతం కనీస కట్టడి చర్యలు చేపట్టలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అఽధికార పార్టీ అండ ఉంటే ప్రకృతిని చెరపట్టి చీల్చేస్తున్నా అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది.
తెలుగురాయపురం, పడమటి కంభంపాడు అడ్డాలుగా ఇసుక దోపిడీ
రోజుకు వందల టిప్పర్ల ఇసుక అక్రమ రవాణా
తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు తరలిపోతున్నా.. ఎక్కడా నో చెకింగ్
అక్రమ రీచ్ సందర్శనకు వెంకటగిరి వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్జి నేదురుమల్లి వెళ్లగానే తవ్వకాలు ఆపేసి పలాయనం
ప్రతిపక్ష పార్టీ నేతలొచ్చి ఇసుక దందా చూపించినా చర్యలు నిల్
ముందు మంత్రి ఆనంను ఆపమనండి.. ఆ తర్వాత చూస్తామన్న వెంకటగిరి ఎమ్మెల్యే
మళ్లీ మరుగంట నుంచే యథా ప్రకారం విచ్చలవిడిగా తవ్వకాలు
సోమశిల డ్యామ్‌కు అతి సమీపంలో ఇసుకను తవ్వేయడంతో ప్రాజెక్ట్ భద్రతకు ముప్పు
పీకేపాడులోనూ ఇదే పరిస్థితి
అనంతసాగరం మండలం పడమటి కంభంపాడులోనూ అనధికార ఇసుక రీచ్ నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఎలాంటి అనుమతులు లేకున్నా నది మధ్యలోనే భారీ యంత్రం పెట్టి లోడింగ్ చేస్తున్నారు. రోజుకు దాదాపు రూ.6 లక్షల మేర ఇసుక దందా జరుగుతుందనే ఆరోపణలున్నాయి. పీకేపాడు రీచ్ కూడా సోమశిల ప్రాజెక్టుకు వంద మీటర్ల దూరంలోనే ఉంది. ఓ వైపు సోమశిల ప్రాజెక్టుకు ముప్పు ఉందని స్థానిక రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తున్నా తమ్ముళ్లు తగ్గడం లేదు. స్థానిక అఽధికార పార్టీ ప్రజాప్రతినిధి అండతో రెచ్చిపోతున్నారు. ఇటీవల ఇసుక అక్రమ రవాణా వాహనాల వల్ల రోడ్లు దెబ్బతిని వాహనాలు వేళ్లే పరిస్థితి లేదని స్థానిక టీడీపీ నేతలే అనధికార రీచ్ వద్ద ఆందోళన చేసిన సంగతి తెల్సిందే. ఇటీవల వర్షా కాలంలో స్కూటర్, బైకులు కూడా ఆ రోడ్డు వైపే వెళ్ల లేని పరిస్థితి నెలకొంది. అంతటి దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. అయినా కూడా తమ్ముళ్లు మాత్రం ఇసుక అక్రమ రవాణా నిలిపివేసే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్నారు.
మామూళ్ల మత్తులో అధికార యంత్రాంగం
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు విరుద్ధంగా పచ్చ నేతలు పెన్నానదిలో ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. జిల్లాకు జలనిధి అయిన సోమశిల ప్రాజెక్ట్‌కు అతి చేరువలో దిగువన తెలుగురాయపురం, పడమటికంభంపాడులో అనధికార రీచ్‌లు ఏర్పాటు చేసి ఇసుక తవ్వుతున్నారు. ఈ రెండు అనధికార రీచ్‌ల్లోనే నిత్యం వందల కొద్దీ టిప్పర్ల ఇసుక తవ్వేస్తున్నారు.ఈ పరిణామాలతో భవిష్యత్‌లో జలాశయం భద్రతకు పెనుముప్పు పొంచి ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా.. జిల్లా అధికార యంత్రాంగాలు వీసమంత బాధ్యతగా వ్యవహరించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీ నేతలు స్వయంగా ఇసుక దందాను బట్టబయలు చేస్తున్నా.. అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ.. ధ్రుతరాష్ట్రుల్లా వ్యవహరిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. ఆపే దమ్ముందా? అనే రీతిలో టీడీపీ నేతలు సవాల్ విసరుతున్నారు.
తెలుగురాయపురం రీచ్‌లో జరిగే అక్రమ ఇసుక రవాణాపై వెంకటగిరి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి మీడియా సాక్షిగా బట్టబయలు చేశారు. రెండు రోజుల క్రితం ఆయన మీడియాను వెంట బెట్టుకుని వెళ్లి రీచ్‌లో సాగే ఇసుక దందాను చూపించారు. భారీ యంత్రంతో నదీ గర్భాన్నే తోడేస్తున్న వైనాన్ని ప్రత్యక్షంగా చూపించినా అధికార యంత్రాంగం కనీస చర్యలు చేపట్టలేదు. ఆయన రీచ్‌లో ఉన్నప్పుడు మాత్రమే ఇసుక లోడింగ్ ఆపేశారు. ఆయన అటు వెళ్లగానే గంటలోపే మళ్లీ యంత్రాలు పెట్టి లోడింగ్ చేశారంటే వారి బరితెగింపు చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
ప్రతిపక్ష పార్టీ మీడియా సాక్షిగా చూపించినా..
ప్రతిపక్ష పార్టీ మీడియా సాక్షిగా చూపించినా..
ప్రతిపక్ష పార్టీ మీడియా సాక్షిగా చూపించినా..


